సాధారణంగా ఘర్షణలు దాడులు వంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే సమయాలలో వర్గాలుగా విడిపోయిన మనుషులు ఒకరినొకరు ఎంతగా కొట్టుకున్నా సరే పోలీసులు స్పందించేతీరు ఒకరకంగా ఉంటుంది. అదే సమయంలో- పోలీసుల మీదనే దాడి జరిగితే గనుక వారు స్పందించే తీరు పూర్తిగా మారిపోతుంది. పోలీసు మీదనే చేయి చేసుకున్న వ్యక్తులను విడిచిపెట్టిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. మరొకసారి ఎవరూ పోలీసు జోలికి రాకూడదు అనిపించేలా వారు చట్టాల చట్టంలో బిగించి బుద్ధి చెబుతుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం చాలా భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.
ఏదో అత్యంత సాధారణమైన హోంగార్డునో, కానిస్టేబుల్ నో కొట్టడం కాదు, ఏకంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మీదనే దాడి చేసి కొడితే అలాంటి దుందుడుకు చర్యపట్ల పోలీసులు స్పందిస్తున్న వైఖరి చాలా చిత్రంగా కనిపిస్తుంది. వారికి కనీస అవమానం కూడా తోచినట్లుగా లేదు. అలాంటి దాడి విషయంలో కేసు పెట్టడం తప్పదు గనుక 307 సెక్షన్ కింద కేసు పెట్టినట్టుగా ఉన్నది తప్ప.. అక్కడితో వారు చేతులు దులిపేసుకున్నారు. హత్యాయత్నం కేసు పెట్టినప్పటికీ అరెస్టు చేయడానికి వారికి ధైర్యం లేదనిపిస్తోంది. ఆ దిశగా అసలు అడుగులు పడడం లేదు. ఏపీ పోలీసుల అసమర్ధత సర్వ త్రావిమర్శల పాలవుతోంది.
మాచర్ల వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటు బూత్ లో ఏవీఎం ను ధ్వంసం చేయడం మాత్రమే కాదు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద దాడి చేసి కొట్టిన మరో కేసులో కూడా నిందితుడు. ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదయి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఏపీలోని పోలీసు యంత్రాంగం ఎంతగా భయపడుతున్నదో అర్థం చేసుకోవడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. సీఐ మీద హత్యాయత్నం చేసినందుకు కేసు నమోదు అయినప్పటికీ పిన్నెల్లి మీద పోలీసులు ఇప్పటిదాకా ఎలాంటి చర్య తీసుకోలేదు.
ఈవీఎం విధ్వంసానికి సంబంధించిన కేసులో ఆయనను జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని మాత్రమే హైకోర్టు తీర్పు చెప్పింది. అంతే తప్ప ఇతర అరాచక పోకడలు, హత్యాయత్నం కేసులకు సంబంధించి కోర్టు మార్గదర్శకాలు ఏమీ లేవు. అయినా సరే పోలీసులు ధైర్యం చేయడం లేదు.
పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తో లాలూచీపడ్డారా? తమ మీద దాడి చేసినా కూడా, హత్యకి యత్నించినా కూడా పరవాలేదు అనుకునే స్థాయి ప్రలోభాలకు లొంగిపోయారా? లేదా, ఆయనను చూసి భయపడుతున్నారా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి. ఈ రెండిట్లో ఏది జరిగినా సరే అది ఏపీలోని పోలీసు వ్యవస్థకు తీవ్రమైన అవమానం అని ప్రజలు భావిస్తున్నారు. ప్రజల్లో తమ పరువు పోకుండా ఉండేందుకు.. తమ పట్ల చులకన భావం ఏర్పడకుండా ఉండేందుకు అయినా సరే.. సీఐ మీద హత్యాప్రయత్నం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి తీరాలని పలువురు భావిస్తున్నారు.