సోము మాటలు కూటమిని ముంచే సంకేతాలా?

సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు. తాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడడం కోసం.. పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి, కాషాయ ముసుగు వేసుకున్న జగన్ అనుచరుడి లాగా వ్యవహరించారనే ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. 2024 ఎన్నికల సమయంలో.. ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం కూడా జాయిన్ కావాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు.. కమలదళం నుంచి ఆ ప్రతిపాదన తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో సోము వీర్రాజు పేరు ముందు వరుసలోనే ఉంటుంది. అటువంటి సోమ వీర్రాజుకు చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టారు. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత సోమ వీర్రాజు ఒకటి రెండు సందర్భాలలో బహిరంగంగా చేసిన ప్రకటనలు కూటమి ధర్మాన్ని ఆయన గౌరవిస్తున్నట్లే కనిపించాయి. చంద్రబాబు నాయుడు పట్ల అనుకూల వైఖరినే ప్రతిబింబించాయి.

అయితే తనకు అలవాటైన  పుల్లవిరుపు మాటల ధోరణి.. చంద్రబాబు నాయుడు మీద సదా విరుచుకుపడే బుద్ధి.. మారలేదని సోము వీర్రాజు తాజాగా నిరూపించుకున్నారు. పీవీఎన్ మాధవ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన  తరుణంలో ప్రసంగించిన సోము కూటమి ధర్మానికి గండి కొట్టే విధంగా కనిపిస్తున్నారు.

పివిఎన్ మాధవ్ తండ్రి చలపతిరావు కూడా ఒకప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయన కొడుకు ఇప్పుడు అధ్యక్షుడు అయ్యాడు. అయితే భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదని ఆ పదాన్ని ప్రస్తావించడం ద్వారా మాధవ్ ని దెప్పిపొడవడానికి సోమ వీర్రాజు ప్రయత్నించినట్లుగా కనిపిస్తోంది. మాధవ్ నే అంటున్నారో.. నారా లోకేష్ ను ఉద్దేశించి విమర్శిస్తున్నారో అర్థంకాని విధంగా అన్నారు. మళ్లీ ఆ మాటలను దిద్దుకుంటూ.. తండ్రి కూడా పార్టీ అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి అయినప్పటికీ తాను సొంతంగా నాయకుడిగా ఎదిగిన వ్యక్తి మాధవ్ అని సమర్ధించుకున్నారు. అలాగే మాధవ్ నాయకత్వంలో ఖచ్చితంగా పార్టీ బలోపేతం అవుతుంది అంటున్నారు. సాధారణంగా కూటమి అధికారంలో ఉన్న ఇలాంటి సమయాలలో.. పార్టీ బలపడుతుందని అంటూనే, కూటమి కలకాలం కొనసాగుతుందనే మాట కూడా నాయకులు చెప్పవలసిన అవసరం ఉంటుంది. అయితే సోము వీర్రాజు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి తప్పకుండా సొంతంగానే అధికారంలోకి వచ్చి తీరుతుంది అని అసందర్భ జోస్యం చెబుతున్నారు. తద్వారా కూటమి నుంచి భారతీయ జనతా పార్టీ విడిపోవడం గ్యారంటీ అనే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. సోము వీర్రాజు వంటి నోటి మీద అదుపు లేని నాయకులు మరో నలుగురు ఉంటే చాలు.. భారతీయ జనతా పార్టీ సర్వ భ్రష్టత్వం చెందుతుందని ప్రజలు వ్యాఖ్యానిస్తుండడం విశేషం.

Related Posts

Comments

spot_img

Recent Stories