విశాఖపట్టణం మీద జగన్మోహన్ రెడ్డికి అంతటి అవ్యాజమైన ప్రేమానురాగాలు ఎందుకు కలిగాయి. ఎక్కడో రాయలసీమలో కడపజిల్లాకు చెందిన ఆ నాయకుడు.. విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేసేస్తానని ప్రకటించి.. అంత హడావుడి ఎందుకు చేశారు. నిజానికి ఆ ప్రకటన వెనుక.. విశాఖపై ప్రేమ ఉందా? ఇంకా ఏదైనా ప్రత్యేకమైన ఇతర ఎజెండా ఉన్నదా? అనే సందేహాలు గత అయిదేళ్లుగానూ ప్రజల్లో ఉన్నాయి. అలాంటి అనేకానేక సందేహాలకు ఒక సమాధానం ఇవాళ బయటకు వచ్చింది. విశాఖ ఉక్కు కార్మికులతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయి వారినుంచి అనేక సంగతులు తెలుసుకునే ప్రయత్నంలో విశాఖపై అవ్యాజమైన జగన్ ప్రేమ వెనుక అసలు కుట్ర కూడా బహిరంగమైంది.
ఎగ్జిక్యూటివ్ రాజధాని అనే ఒక మాయపూరితమైన పదాన్ని ప్రకటించారే తప్ప జగన్మోహన్ రెడ్డి విశాఖ పట్టణానికి కూడా అయిదేళ్ల పదవీకాలంలో ఒరగబెట్టిందేమీ లేదు. కేవలం రుషికొండను గుండు గొరిగించేసి.. మరో మూడు దశాబ్దాల పాటూ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయే తాను, తన కూతుళ్లు రాజరికపు వైభవం అనుభవిస్తూ జీవించడానికి మూడు భవంతులు నిర్మించడం మినహా ఆ నగరానికి ఆయన మరొక్క పని చేయనేలేదు. చీటికీ మాటికీ వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసమే రాజధాని ఆలోచన అనే మోసపూరిత మాటలను అందరూ గమనించారు. కానీ.. ఆ ముసుగులో ఆ నగరంపై ఆయన పన్నిన అనేకానేక కుట్రల్లో కీలకమైన ఒకటి- విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన వేల కోట్ల విలువైన భూములను విక్రయించేయడం కూడా ఒకటి అని ఇవాళ అధికారికంగా బయటకు వచ్చింది.
మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో పవన్ కల్యాణ్ విశాఖ ఉక్కు కార్మికులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రెవేటీకరణ జరగకుండా చూడాలని వారు పవన్ ను కోరారు. ఎన్నో బలిదానాల తర్వాత విశాఖ ఉక్కు ఏర్పడిందని, కార్మికుల వాదనను కేంద్రం దృష్టికి తీసుకువెళతానని పవన్ వారికి మాట ఇచ్చారు.
ఈ సందర్భంగా పవన్ ప్రశ్నలకు వారు సమాధానమిస్తూ.. గత ప్రభుత్వ హయాంలో విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన భూములను విక్రయించేయడానికి జగన్ ప్రతిపాదించిన మాట నిజమే అని వారు వెల్లడించారు. అప్పట్లో పుకార్లుగా ఈ మాట వినిపించింది గానీ.. ఇప్పుడు జగన్ అసలు కుట్ర ధ్రువపడింది.
మొత్తానికి విశాఖ ఉక్కుకు గనులు కేటాయించడం, వర్కింగ్ కేపిటల్ ఇవ్వడం, సెయిల్ లో విలీనం చేయడం, ఎన్ఎండీసీ నగర్‌నార్ స్టీల్స్ విలీనం చేయడం, స్ట్రాటజిక్ ప్లాన్ పరిధిలోకి తీసుకోవడం వంటి కీలక డిమాండ్లు ఉద్యోగులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వాటిలో ఎన్నింటిని కేంద్రం ద్వారా సానుకూలం చేస్తారో వేచిచూడాలి.