ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీగా బిజెపి అధిష్ఠానం ఆర్.కృష్ణయ్యను ఎంపిక చేయడంపై ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఏపీ భారతీయ జనతా పార్టీలో సమర్థులైన బీసీ నాయకులకు గతిలేదా? తెలంగాణ నుంచి బీసీ నాయకుడిని దిగుమతి చేసుకోవాల్సిన ఖర్మ ఏపీ బిజెపికి ఉన్నదా? అనే వాదన ఊపందుకుంటోంది. కేవలం తెలంగాణ నుంచి దిగుమతి చేసుకోవడం అనే ఒక్క పాయింటు మాత్రమే కాదు. ఇప్పటికిప్పుడు బయటినుంచి వలస వచ్చిన అవకాశ వాద నాయకుడిని ఇలా తక్షణమే అందలం ఎక్కించి పదవి కట్టబెట్టవలసినంత దుస్థితిలో ఏపీ బీజేపీ ఉన్నదా? అని కూడా పలువురు చర్చించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో అర్హులైన నాయకులకు కొదువ లేదు. ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కని, పార్టీకి విస్తృత సేవలు అందిస్తూ ఉండే సీనియర్లను రాజ్యసభకు పంపడం అనేది పరిపాటి. అలాంటి నాయకులు ఏపీ బీజెపిలో పుష్కలంగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా తమ పార్టీ అధికార కూటమిలో భాగం కావడం వలన.. తమకు అవకాశం దక్కుతుందని వారు సహజంగానే ఆశలు పెంచుకుంటూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో వారందరి ఆశలపై నీళ్లు చిలకరిస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ కు చెందిన వలస నాయకుడు ఆర్.కృష్ణయ్యను రాజ్యసభ ఎంపీగా ఎంపిక చేసింది. ఆ పార్టీ దేశంలోని మూడు రాజ్యసభ స్థానాలకు సోమవారం ప్రకటించిన అభ్యర్థుల పేర్లలో ఆర్.కృష్ణయ్య పేరు కూడా ఉంది.
ఈ నిర్ణయాన్ని ఏపీ బిజెపి నాయకులు చాలా అవమానంగా భావిస్తున్నారు. ఆర్.కృష్ణయ్య బీసీ సంఘాల నాయకుడిగా గుర్తింపు ఉన్న వ్యక్తే అయినప్పటికీ.. మొన్నమొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి భజన చేస్తూ.. ఆయన ప్రాపకంలో ఆ పార్టీనుంచి ఎంపీ స్థానం దక్కించుకున్న వ్యక్తి అని వారు గుర్తు చేస్తున్నారు. జగన్ ఓడిపోయిన తర్వాత.. ఆ పార్టీకి రాజీనామా చేసిన అవకాశవాదిగా ఆర్.కృష్ణయ్యను అభివర్ణిస్తున్నారు. ఆయనేదో అవకాశవాదంతో.. వేరే గతిలేక తమ పార్టీకి దగ్గరవుతుండగా.. అలాంటి వ్యక్తికి తక్షణమే పదవి ఇవ్వడం ఏంటని తమలో తాము చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని.. ఆర్.కృష్ణయ్యకు పదవి కట్టబెట్టే విషయంలో కమల అధిష్ఠానం పునరాలోచన చేయాలని కోరుకుంటున్నారు.