తీరు మారుతున్న ఏపీ పోలీస్!

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రజల నాడి ఎలా ఉండబోతున్నదో ప్రభుత్వాధికారుల పోకడలను గమనిస్తే సునాయాసంగా అర్థమవుతుంది.  ప్రజలను అడిగి పసిగట్టడంలో ప్రభుత్వానికి సమాచారం చేరవేయడానికి మాత్రమే కాదు,  తమ తమ తీరుతెన్నులను సమీక్షించుకోవడానికి కూడా పోలీస్ వర్గాలు పనిచేస్తుంటాయి.  ప్రజల నాడి మళ్లుతోందని భావిస్తే..  తదనగుణంగా వారు తమ వ్యవహార సరళని కూడా మార్చుకుంటారు.  ఇప్పుడు ఏపీ పోలీసుల తీరును గమనిస్తే..  రాబోయే ఎన్నికల్లో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తథ్యం అనే అభిప్రాయం కలుగుతుంది.

సాధారణంగా పోలీసు శాఖ ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న వారికి విధేయంగానే ఉంటుంది. పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారని, వైసీపీ ఏజంట్లుగా మారిపోయారని పదేపదే వారిని నిందించడంలో ఎలాంటి ఉపయోగం ఉండదు. కొందరు పెద్దస్థాయిలో ఉండే అధికారులు అలా పార్టీలకు కొమ్ము కాయవచ్చు గానీ.. సాధారణంగా పోలీసు డిపార్టుమెంట్ మొత్తం.. బాసిజానికి అలవాటు పడి ఉంటుంది. బాస్ ఏం చెబితే అదే రైటు అన్నట్టుగా పనిచేసుకుంటూ పోతారు.

అయితే ఎన్నికల సమయంలో పరిస్థితి మారుతుంది. ప్రజల నాడిని నిత్యం ప్రజల్లోనే ఉండే పోలీసులు దగ్గరినుంచి గమనిస్తుంటారు. పైగా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదికలు ఇచ్చే బాధ్యత కూడా వారికే ఉంటుంది. ఇలాంటి క్రమంలో.. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయో అందరికంటె బాగా వారికి సంకేతాలు అందుతాయి. ప్రస్తుత అధికారంలో ఉన్న పార్టీకి భిన్నంగా ఫలితాలు ఉండబోతున్నాయని వారికి సంకేతాలు అందితే.. వారి విధేయత కూడా నెమ్మదిగా పలచబడుతూ ఉంటుంది. గెలుస్తుందని అనిపించే పార్టీ వైపు మొగ్గు చూపడం, లేదా తటస్థంగా ఉండడం చేస్తుంటారు. ఇప్పుడు ఏపీ పోలీస్ అదే పనిచేస్తోంది.

ముఖ్యమంత్రి జగన్ సభలు జరిగినప్పుడు.. బలవంతంగా జనాన్ని పోగేయడం సహజంగా జరిగే విషయమే. అయితే సభా ప్రారంభం వరకు వారిని పోలీసులు బలవంతంగా కట్టడిచేసి ఉంచుతారు. సభ మొదలయ్యాక అంత కట్టడి ఉండదు. సభ మొదలయ్యాక, జగన్ ప్రసంగం ప్రారంభించాక అనేకమంది వెళ్లిపోవడం జరుగుతుండేది. గతంలో ఇలాంటి పరువునష్టం వ్యవహారాలు బయటపడకుండా.. పోలీసులతో వెళ్లిపోయేవారిని అడ్డుకునే వారు. ఇన్ డోర్ కార్యక్రమాలు అయితే తలుపులు వేసేసి గడియపెట్టి ఎవ్వరినీ కదలనివ్వకుండా సభ జరిపేవాళ్లు. బహిరంగ వేదికల వద్ద కూడా ఎగ్జిట్ ల వద్ద జనం పారిపోకుండా పోలీసులు కాపలా ఉండేవాళ్లు.
తాజాగా జగన్ బనగానపల్లెలో సభ నిర్వహిస్తే.. ఆయన ప్రసంగం మొదలు కాగానే జనం పలాయనమంత్రం పఠించడం మొదలైంది. ట్విస్టు ఏమిటంటే.. వారిని ఆపడం గురించి గానీ, సభలోనే ఉండేలా.. జనం కనిపించేలా చేయడం గురించి గానీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ పోలీసులు సరికొత్త తీరును గమనిస్తోంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతున్నదని క్లియర్ గా అర్థమైపోతోందని ప్రజలు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories