వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పుడు తరచుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వీలు చిక్కుతోంది. ఆయన అపాయింట్మెంట్ లభిస్తోంది. మంచీ చెడు తమ పార్టీ అధినేతతో మాట్లాడుకోవడానికి వారికి అవకాశం దొరుకుతోంది. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వడమే చాలా అరుదుగా జరిగే వ్యవహారం. అలాంటిది ఇప్పుడు మాజీ అయిన తర్వాత, ఆయన పార్టీ నాయకులను కలుస్తున్నారు. ఓడిపోయిన తీరుకు సంబంధించి వారితో మాట్లాడుతున్నారు.
ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్న ఎమ్మెల్యేలు- ప్రజలలో వ్యక్తమైన వ్యతిరేకతను తాము అంచనా వేయలేకపోయామని, ఎన్నడూ ప్రజల్లో ఆ భావన కనిపించనే లేదని చెబుతున్నారు. కేవలం ఉద్యోగ వర్గాలలో మాత్రం స్పష్టమైన వ్యతిరేకత ఉండగా, సామాన్యులు తమ పథకాల లబ్ధిదారులు అయిన ప్రజల్లో మాత్రం తమ పట్ల పూర్తి సానుకూలత మాత్రమే ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ ఇంటికి ఎంత మొత్తం ధనం వివిధ పథకాల రూపంలో అందించామో ఒక లేఖ రూపంలో స్పష్టంగా తెలియజేస్తూ ప్రతి ఇంటికి గడపగడపకు కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలను తిప్పారు. అయితే అలా ఇంటింటికి వెళ్లినప్పుడు కూడా ప్రజలలో ఉన్న వ్యతిరేకత తమకు కనిపించలేదని ఇప్పుడు ఓడిపోయిన వారు జగన్ ను కలిసి గొల్లుమంటున్నారు.
కానీ ఇక్కడ వారు గమనించాల్సిన వాస్తవం ఒకటి ఉంది. ప్రజలలో వ్యతిరేకత కనిపించలేదనడం అబద్ధం. ప్రజలలో వ్యతిరేకత ఉండేది.. దానిని ప్రజలు చాలా జాగ్రత్తగా దాచి పెట్టుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాగిస్తూ వచ్చిన విధ్వంసకమైన పరిపాలన చూసి జడుసుకున్న సామాన్య ప్రజలు గడపగడపకు అనే ముసుగులో తమ ఇంటికి వచ్చి నిధులన్నీ తమకు దోచిపెట్టినట్టుగా చెబుతున్న ఎమ్మెల్యేలతో ఆ వ్యతిరేకతను చూపించడానికి భయపడ్డారు. నాయకులతో తమ మాటల్లో ఏ చిన్నపాటి వ్యతిరేకత కనిపించినా సరే, తమ కుటుంబానికి దక్కుతున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వారు సంశయించారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారితో గాని, వాలంటీర్లతో గాని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా జగన్ అనుకూల ధోరణితోనే మాట్లాడుతూ నటించారు. కేవలం వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా ఈ ప్రభుత్వం జైల్లో పెట్టేస్తుందేమో.. తమ పథకాలను తొలగించేస్తుందేమో.. రకరకాల కేసులు పెట్టి జీవితాంతం ఇబ్బంది పెడుతూ ఉంటారేమో అని ప్రజలందరూ భయపడినందు వల్ల మాత్రమే ఆ వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులాగా ఉండిపోయింది. సరిగ్గా ఎన్నికల సమయం వచ్చిన తర్వాత పోలింగ్ నాడు ఆ నిప్పు అగ్నిజ్వాలలా రాజుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దహించి వేసింది. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ మోహన్ రెడ్డికి కనీసం భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ముందు ముందు కూడా పరాజయాలు తప్పవు అని ప్రజలు భావిస్తున్నారు.