ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు నియామకానికి కసరత్తు ప్రారంభం అయింది. ఏకంగా 18 ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. మొత్తంగా వివిధ శాఖలలో 866 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్లు రానున్నాయి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తరువాత రోస్టర్ పాయింట్లు ఖరారు చేయాల్సిన ప్రక్రియ ఒకటే మిగిలి ఉంది. ఈలోగా ఉద్యోగ నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ సిద్ధం చేస్తుందని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో 16 వేల పైచిలుకు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తర్వాత ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కి ఘనంగా శ్రీకారం చుట్టింది. ఆ క్రమంలో ఈ 866 ఉద్యోగాల భర్తీ రెండో దశ అని పలువురు అంటున్నారు.
కూటమి ప్రభుత్వం తాము ఎన్నికల ప్రచార సమయంలో మాట ఇచ్చినట్టుగా ఈ అయిదేళ్ల పదవీకాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు యువతరానికి కానుకగా ఇచ్చేందుకు కృతనిశ్చయంతో అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీలను కూడా భర్తీ చేయడానికి పూనుకుంటోంది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం తీర్పు వచ్చిన తరువాత.. రాష్ట్రంలో అది అమలు చేసే వరకు ఉద్యోగాల నియామక ప్రక్రియలో జాప్యం జరిగింది. ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్సు తీసుకువచ్చింది. దాంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆటంకాలు తొలగిపోయాయి. మొదటగా.. సర్కారు ఏర్పడిన తర్వాత పెట్టిన తొలి సంతకాల్లో ఒకటైన మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే.. ఇప్పుడు వివిధశాఖల్లో సుదీర్ఘకాలంగా ఉండే ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధం చేస్తున్నారు.
శాఖల వారీగా గమనించినప్పుడు.. ఒక్క అటవీ శాఖలో మాత్రం 814 పోస్టులున్నాయి. వ్యవసాయశాఖలో 10, దేవాదాయ శాఖ ఈవో పోస్టులు 7, జిల్లా సైనిక్ అధికారి పోస్టులు 7 .. ఇలా వివిధ శాఖల్లో పోస్టులున్నాయి. ఈ పోస్టులు అన్నీ కూడా ఎస్సీ వర్గీకరణ కొత్త నిబంధనలు, రిజర్వేషన్ లకు అనుగుణంగా భర్తీ జరుగుతుంది. మరోవై గ్రూపు 1 ద్వారా జరిగే నియామకాల కసరత్తు కూడా నడుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల పరంగా కూడా వీలైనంత వరకు ఖాళీలు భర్తీ చేయడానికి ప్రభుత్వం అడుగులు వేుస్తోంది. రాబోయే నాలుగేళ్లలో అటు ప్రభుత్వ, ఇటు ప్రెవేటు రంగాల్లో కొలువుల జాతర నడవబోతున్నదని.. ఈ జాతర మెగా డీఎస్సీతోనే షురూ అయిందని ఆశావహులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.