దొంగపని చేసిన ప్రతివాడూ జైలుకు వెళ్లాల్సిందే!

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న అయిదేళ్లపాటూ ఆయన అనుచరులంతా విచ్చలవిడిగాచెలరేగిపోయారు. అధికారం తమ చేతిలో ఉన్నది కదాని.. అడ్డగోలు దందాలు సాగించిన కార్యకర్తలు, నాయకులు కొందరైతే.. అచ్చమైన దొంగపనికే పాల్పడిన వారు అనేకులు. అమరావతి లో సగం పూర్తయిన నిర్మాణాలలోనే తలుపులు వంటి అనేకం దొంగలించుకువెళ్లిపోయిన వారు ఉన్నారు. కంకర సహా దొంగతనంగా ఎత్తుకుపోయిన వారున్నారు. ఇలాంటి తప్పుడు పనులకు రాష్ట్రస్థాయిలో ప్రతిచోటా, తమకు చేతనైనంత స్థాయిలో పాల్పడుతూనే వచ్చారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ప్రతిచోటా జరిగిన అన్ని అక్రమాలనూ బయటకు తీస్తోంది. దొంగలందరినీ, తప్పుడు పనులు చేసిన వారందరినీ కటకటాల వెనక్కు  పంపుతోంది.

పెద్ద నాయకులు వారి స్థాయిలో స్వాహా పర్వాలకు పాల్పడితే.. చిన్న నాయకులు వారి లెవలుకు తగ్గట్టుగా ఎక్కడికక్కడా దిగమింగారు. అనంతపురం జిల్లాలో ఓ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు.. నిర్మాణంలో ఉన్న వంతెన పనుల దగ్గరినుంచి ఏడు టన్నుల ఇనుమును ఎత్తుకెళ్లాడు. 2022 జనవరిలో ఈ సంఘటన జరిగింది. అక్కడి అధికారులు, సిబ్బందిని బెదిరించి మరీ ఆ ఇనుము తరలించుకు వెళ్లిపోయారు. నిర్మాణ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసినా , ప్రభుత్వం కూడా వారిదే కావడంతో అతీగతీ లేకుండాపోయింది.

తీరా, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత.. సంస్థ మళ్లీ పోలీసులకు ఫిర్యాదుచేసింది. వారు కేసు నమోదు చేసి, ఇనుము ఎత్తుకెళ్లిన వైసీపీ నాయకుడు కుర్లి శివారెడ్డిని అరెస్టు చేశారు. ఇప్పటికే ఒకటిన్నర టన్నుల ఇనుపకడ్డీలు స్వాధీనం కూడా చేసుకున్నారు.

ఇలాంటి తప్పుడు పనులు మాత్రమే కాదు.. వైసీపీ నాయకులు అప్పట్లో ప్రభుత్వ ఆస్తులను తమ సొంత ఆస్తుల్లా వాడేసుకున్న అన్ని పాపాలకూ సంబంధించి ఎన్డీయే సర్కారు ఇప్పుడు దృష్టి పెడుతోంది. అధికారం తమకు శాశ్వతం అని భావించినట్టుగా చెలరేగిపోయిన వైసీపీ మూకలు ఇప్పుడు కటకటాల వెనక్కు వెళ్లక తప్పదని పలువురు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories