వైసీపీలో మరో వికెట్ డౌన్ : మాజీ ఎమ్మెల్యే వీడుకోలు!

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ  ముహూర్తంలో కూటమి ప్రభుత్వం మీద పోరాటాలు ప్రారంభించాలని, ఆరునెలల గడువు అయిపోయిందని.. ఒక సుదీర్ఘ కార్యచరణ ప్రణాళికను పార్టీ నాయకుల నెత్తిన పులుముతున్నారు. అయితే ఎన్నికల్లో భారీగా ఖర్చులు పెట్టి పరాజయం పాలై.. కుదేలైపోయి ఉన్న నాయకులు.. జగన్ తమ నెత్తిన రుద్దుతున్న ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా? లేదా? అనేది ఆయన పట్టించుకోవడం లేదు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఆయన పోరాటాలకు పిలుపు ఇచ్చిన ఫలితం చాలా దారుణంగా ఉంటోంది. నాయకులు ఒక్కరొక్కరుగా ఏకంగా పార్టీని వీడిపోతున్నారు. ఒకవైపు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా పార్టీని వీడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

గ్రంథి శ్రీనివాస్ అంటే.. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. 2019 ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ ను ఓడించిన జెయింట్ కిల్లర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. జెయింట్ కిల్లర్ అయినంత మాత్రాన ఆయనకు పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ ప్రత్యేకంగా దక్కిన ప్రాధాన్యం ఏమీ లేదు.
2004లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి టీంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన గ్రంథి శ్రీనివాస్ తదనంతర పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే 2009 ఎన్నికల్లో ఆయనకు చాన్స్ రాలేదు. తర్వాత వైసీపీలో చేరారు గానీ.. 2014లో ఓడిపోయారు.2019లో అదే వైసీపీ నుంచి పవన్ పై గెలిచారు.

ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఆయన అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కూడా ఆయన మొహం చాటేస్తున్నారు. గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం సుదీర్ఘకాలంగా ఉంది. అయితే.. ఆయన గతంలో తనను ఓడించిన నాయకుడు కావడంతో.. ఇప్పుడు తెలుగుదేశంలో చేరడానికి పవన్ కల్యాణ్ ఏమైనా అడ్డు చెబుతారేమో అనే పుకార్లు కూడా వచ్చాయి. తాజాగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం మీద పోరాటాలకు జగన్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఒకేరోజులో రెండు కీలక నాయకులు పార్టీకి వీడుకోలు పలికారు. గ్రంథి శ్రీనివాస్ కూడా ఇదే రోజున గుడ్ బై చెప్పేయడం వైసీపీలో చర్చనీయాంశంగా ఉంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories