ఆ టీచరుకు మరో శెభాష్.. లోకేష్ పూనికతో రూ.లక్ష!

విద్యార్థులు సరిగా బడికి రావడం లేదు. ఎడ్మిషన్లు పడిపోతున్నాయి. ఆ స్కూలుకు చేరుకోవడానికి సరైన దారి కూడా లేదు. స్కూలులో పిల్లల సంఖ్య అయిదుకు పడిపోయింది… ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? అంత తక్కువ మంది విద్యార్థులుంటే ఆ పరిస్థితిని హాయిగా ఎంజాయ్ చేస్తారు. స్కూలుకు వెళితే.. అయిదుగురికీ ఏదో కాసేపు పాఠం చెప్పేసీ.. మొబైల్లో వీడియోలు, రీల్స్ చూసుకుంటూ గడుపుతారు. లేదా, తాను కూడా స్కూలుకు రెండు మూడు రోజులకు ఓసారి వెళుతూ.. పిల్లల్ని కూడా ఆరోజు రమ్మని చెబుతూ గడిపేస్తారు. కానీ అనిశెట్టి సీతారామరాజు అలా కాదు. అందుకే ఇవాళ రాష్ట్రంలోని అందరితోనూ శెభాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా మరోసారి శెభాష్ అనిపించుకునే పని చేస్తున్నాడు.

కాకినాడ జిల్లా సూరంపేట స్కూలుకు పంటకాలువ దాటి రావాల్సి ఉన్నందున పిల్లలు సరిగా రాకపోతుండడంతో టీచరు సీతారామరాజు చొరవ తీసుకున్నాడు. తన సొంత డబ్బు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి.. ఆ పంటకాలువ మీద నడిచి రావడానికి వంతెన ఏర్పాటు చేయించాడు. దీంతో స్కూల్లో పిల్లల స్ట్రెంగ్త్ పెరిగింది. ఈ వార్త రాష్ట్రంలో అందరినీ ఆకర్షించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా సీతారామరాజును ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక ట్వీటు పెట్టారు.

నారా లోకేష్ అంతటితో వదిలిపెట్టలేదు. కాకినాడ జిల్లా కలెక్టరును ప్రత్యేకంగా ఆదేశించారు. దీంతో కలెక్టరు షాన్ మోహన్.. టీచరు సీతారామరాజును పిలిపించి.. లక్షరూపాయల చెక్కును అతనికి అందజేసి అభినందించారు. పాఠశాలకు పిల్లలు రావడం కోసం వంతెన నిర్మాణం చేపట్టినప్పుడు ఎదురైన అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడడంతో పాటు, గుణాత్మక విద్య అందించాలని కూడా సూచించారు.

తమాషా ఏంటంటే.. టీచరు సీతారామరాజు తన సొంత డబ్బు లక్షరూపాయలు ఖర్చు పెట్టి పాఠశాలకు వంతెను వేయించారు. పిల్లల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం అభినందించింది. నారా లోకేష్ పూనికతో ప్రభుత్వం ఆయనకు తను ఖర్చు చేసిన డబ్బును కూడా అందించింది. అయితే కలెక్టరు చేతినుంచి రూ.లక్ష తనకు చెక్కు అందిన తర్వాత.. ఆ డబ్బుతో పాఠశాల భవనానికి అవసరమైన ఇతర మౌలిక వసతులు కల్పిస్తానని సీతారామరాజు అంటున్నాడు. అంటే ఆ డబ్బును కూడా ఆయన తన సొంతానికి వాడుకోదలచుకోవడం లేదు. తను పెట్టిన ఖర్చు వచ్చేసిందని అనుకోవడం లేదు. ఇంకా వేరే మంచి పనులు చేస్తానంటున్నాడు. మరి అంత ఔదార్యం ఉన్న టీచరును మరోసారి శెభాష్ అనాల్సిందే కదా!

Related Posts

Comments

spot_img

Recent Stories