వివేకాహత్య- అవినాష్ పాత్రపై మరో ప్రజెంటేషన్!

ఈ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసేలోగానే.. వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులు ఎవరో, వారి పాత్ర ఏమిటో, వారికి పడవలసిన శిక్ష ఏమిటో ప్రజాకోర్టులోనే తేల్చిచూపించడానికి ఆయన కూతురు సునీత కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం నుంచి, విమర్శల దాడి చేయడం నుంచి అవినాష్ రెడ్డి మీద పోటీచేస్తున్న షర్మిల అయినా ఒకరోజు విరామం తీసుకోవచ్చునేమో గానీ.. సునీత ఆమాత్రం గ్యాప్ కూడా ఇవ్వడం లేదు. ప్రచారంలో గ్యాప్ రాగానే ఆమె హైదరాబాదులో మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వివేకా హత్యవెనుక అవినాష్ రెడ్డికి ఏరకంగా స్పష్టమవుతున్నదో మరోసారి అందరికీ వివరించి చెప్పే ప్రయత్నం చేశారు.

జగన్ మరియు అవినాష్ రెడ్డి, వారి అనుచరులు పదేపదే వివేకాతో సునీతకు విభేదాలు ఉన్నాయని, ఆమె తన భర్తతో కలిసి చంపించి ఉండచ్చునని ఆరోపణలు చేస్తూ వచ్చిన సంగతి కూడా ప్రజలకు తెలుసు. అయితే.. సునీత కూడా తండ్రితో కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని, అంతమాత్రాన నాకు తండ్రి కాకుండా పోతారా? అని ప్రశ్నించారు. వివేకానందరెడ్డికి కూతురైనా కొడుకైనా తానేనని, తేల్చిచెప్పారు.


హత్య జరిగిన సమయంలో అవినాష్ రెడ్డికి- హత్యచేసిన ఎర్రగంగిరెడ్డికి మధ్య ఫోన్ కాల్స్ నడిచాయని కూడా సునీత ఆధారాలతో సహా చెబుతున్నారు. తన తండ్రి వివేకానందరెడ్డి స్థాయికి చేరుకోవడం అసాధ్యం అని భావించినందునే, తాను ఎంపీ కావాలని అనుకుంటున్న కలలకు ఆయన అడ్డుపడుతున్నందునే అవినాష్ రెడ్డి చంపించారని మరోసారి ఆరోపించారు. అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి ఫోన్ హత్య జరిగిన సమయంలో మార్చి 14 నుంచి 16 వ తేదీ వరకు స్విచాఫ్ ఉండడాన్ని కూడా ఆమె ప్రస్తావిస్తున్నారు.


మొత్తానికి వివేకాహత్య వెనుక ప్రధాన సూత్రధారి అవినాష్ రెడ్డి అని, ఆయనే తన తండ్రిని చంపించాడని, సదరు అవినాష్ రెడ్డిని, అసలు హంతకులను కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని.. ప్రజలు నమ్మితే చాలు అన్నట్టుగా సునీత అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. ఈ ఆరోపణలన్నీ సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చిన సంగతులే. అయితే న్యాయస్థానాల్లో వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. జగన్ కాపాడుతున్నందువల్లనే అవినాష్ బయట తిరుగగలుగుతున్నారనేది ఆమె ఆరోపణ. అయితే ఈ ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని ఓడించడం ద్వారా.. వివేకా హత్య విషయంలో అసలు నిందితులెవరో ప్రజలు నమ్మితే చాలునని, ప్రజల తీర్పు ముఖ్యమని సునీత అనుకుంటున్నట్టుగా ఉంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories