మరో మల్టీ స్టారర్‌!

ప్రస్తుతం మ‌ల్టీస్టార‌ర్ల త‌రం నడుస్తుంది. ఇద్ద‌రు ముగ్గురు హీరోలు క‌లిసి ఒకే సినిమాలో న‌టించ‌డానికి మంచి ఉత్సాహం చూపిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ – ఎన్టీఆర్‌లు క‌లిసి బాక్సాఫీసు ఎలాంటి ప్ర‌భంజ‌నం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్ క‌లిసి ‘వార్ 2’ లో నటిస్తున్నారు. ఇప్పుడు దేశం మొత్తం త‌న‌వైపునకు తిరిగి చూసేలా ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు అట్లీ.

‘జ‌వాన్‌’తో కొద్దిరోజుల క్రితం ఓ సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టాడు అట్లీ. షారుఖ్ ఖాన్ క‌థానాయకుడిగా న‌టించిన ఈ చిత్రం భారీ విజ‌యాన్ని అందుకొంది. ఆ త‌ర‌వాత స‌ల్మాన్ – విజ‌య్ హీరోలుగా ఓ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నాడ‌నే వార్తలు వినపడుతున్నాయి. వాటిపై అట్లీ స‌స్పెన్స్ కొన‌సాగిస్తున్నాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో మాత్రం త‌న తరువాత సినిమా గురించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశాడు.

త‌న త‌దుప‌రి సినిమాకు సంబంధించిన స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, ఈ సినిమాలో స్టార్స్ చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోతార‌ని, అవుటాఫ్ ది వ‌ర‌ల్డ్ ఐడియాతో ఈసారి సినిమా చేస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు అట్లీ. త‌మిళ ప‌రిశ్ర‌మ కూడా అట్లీ త‌దుప‌రి సినిమా గురించి చాలా ఆసక్తిగా చ‌ర్చించుకొంటోంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ కోసం అట్లీ ప్లాన్ చేస్తున్నాడ‌ని, ఈ సినిమాలో ఇద్ద‌రు కాద‌ని, ఏకంగా న‌లుగురు స్టార్లు ఉంటార‌ని, ప్ర‌తీ పాత్ర‌కూ క్రేజీ స్టార్‌నే రంగంలోకి దింపాల‌ని అట్లీ ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని వార్త‌లు వినపడుతున్నాయి. తెలుగు నుంచి కూడా ఓ ప్ర‌ముఖ హీరో ఈ ప్రాజెక్టులో భాగం పంచుకొనే అవ‌కాశం ఉంద‌ని కనపడుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories