వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమానా సాగిన రోజుల్లో.. అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తో ఉన్న అనుబంధాన్ని వాడుకుంటూ అరాచకంగా చెలరేగిన వ్యక్తి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా.. తెదేపావారితో అనుబంధాన్ని వాడుకుంటూ చెలరేగిన వ్యక్తి తులసిబాబు. జగన్ పదవీచ్యుతులు అయిన తర్వాత అప్పట్లో కన్నూమిన్నూ గానకుండా ప్రవర్తించిన ప్రతి ఒక్కరినీ చట్టం చట్రంలోకి తీసుకువస్తూ.. కేసులు నమోదు చేయిస్తూ వారి సంగతి తేలుస్తున్న వ్యక్తి డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజు! అలాంటి ఆర్ఆర్ఆర్ ఇప్పుడు తులసిబాబు మీద మరో ఉచ్చు బిగుస్తున్నారు.
కస్టోడియల్ టార్చర్ కేసులో తన గుండెల మీద కూర్చుని కొట్టిన వ్యక్తి తులసిబాబే అని చెబుతున్న రఘురామ, అతని మీద అచ్చమైన లాపాయింటుతో మరో కేసు నమోదు చేయబోతున్నారు.
విషయం ఏంటంటే.. అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తో ఉన్న అనుబంధం కొద్దీ.. తులసిబాబు సీఐడీ కేసుల్లో న్యాయసలహాదారుగా 2021 మే నెలలో నియమితులు అయ్యారు. అయితే నియామకం జరిగేనాటికి తులసిబాబుకు న్యాయవాదిగా గుర్తింపు లేనేలేదుట. 2021 అక్టోబరులో ఆయన బార్ అసోసియేషన్ లో ఎన్ రోల్ చేయించుకున్నారట. ఈ విషయాన్ని రఘురామక్రిష్ణ రాజు బయటపెడుతున్నారు. తన మీద కస్టోడియల్ టార్చర్ జరిగిన తర్వాత గానీ.. తులసిబాబు అసలు న్యాయవాదిగా ఎన్రోల్ కానేలేదని.. అసలు న్యాయవాది కాని వ్యక్తికి అప్పటికే న్యాయసలహాదారు పదవిని కట్టబెట్టి.. ప్రభుత్వం ఎలా వేతనాలు చెల్లించిందని రఘురామ ప్రశ్నిస్తున్నారు.
తులసిబాబు నియామకం విషయంలో మరో లీగల్ పాయింట్ ను కూడా రఘురామ పట్టుకున్నారు. తులసిబాబుకు ఇచ్చిన నియామక ఉత్తర్వుల్లో హైకోర్టులో ట్రయల్ నడపడం కోసమే తులసిబాబును తీసుకున్నట్టుగతా పేర్కొన్నారని చెప్పారు. నిజానికి సీఐడీ కేసుల్లో హైకోర్టులో ట్రయల్ జరగదని, జిల్లా కోర్టులో గానీ, ట్రయల్ కోర్టులో గానీ మాత్రమే జరుగుతుందని రఘురామ వివరిస్తున్నారు. ఇలాంటి అక్రమ దొడ్డిదారి నియామకం ద్వారా తులసిబాబుకు జగన్ సర్కారు కోటిరూపాయలకు పైగా వేతనాలు చెల్లించిందనేది ఆయన ఆరోపణ. ఈ విషయంలో త్వరలోనే ఏసీబీకి లేఖ రాయబోతున్నట్టు ఆయన వెల్లడించారు.
కస్టోడియల్ టార్చర్ కేసులో రఘురామక్రిష్ణ రాజు గుంటూరు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తులసిబాబు చుట్టూ బిగుసుకోబోతున్న సరికొత్త కేసు గురించి ఆయన వివరాలు తెలియజేశారు. మొత్తానికి జగన్ సర్కారు జమానాలో ఎన్నెన్ని అక్రమాలతో అయినవారికి దోచిపెట్టారో ఇప్పుడు ఒక్కటొక్కటిగా లెక్కలు తేలుతున్నాయి. సాక్ష్యాలతో సహా రఘురామ కేసు పెట్టడానికి సిద్ధమవుతుండడంతో.. తులసిబాబు నియామకానికి సంబంధించి సునీల్ కుమార్ కూడా ఇరుక్కునే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.