జగన్ కళ్లలో ఆనందం చూడడం కోసం.. ఆయన అధికారంలో ఉన్న రోజుల్లో విచ్చలవిడిగా రెచ్చిపోయిన మరొక సీనియర్ ఐపీఎస్ అధికారి తాజాగా జైలుకు వెళ్లారు. జగన్ నమ్మకాన్ని చూరగొని, ఆయన హయాంలో.. ఆయన రాజకీయ ప్రత్యర్థుల్ని, తన శత్రువులుగా పరిగణించి వారందరినీ వేధించడానికి జగన్ చేతిలోని బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగపడిన ఒక అధికారి ఎట్టకేలకు ఇన్నాళ్లకు జైలుకు వెళ్లారు. ముందస్తు బెయిళ్ల కోసం, అరెస్టు నుంచి రక్షణ కోసం ఆయన రకరకాల పిటిషన్లు వేసుకుని భంగపడ్డారు. ఇక ఎటూ తప్పించుకునే చాన్సు లేక.. చివరికి ఏసీబీ కోర్టు ఎదుట లొంగిపోవడంతో.. వచ్చేనెల 9 వరకు రిమాండుకు పంపారు. కాగా ఆయనను కస్టడీకి తీసుకుని విచారించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.
జగన్ ప్రభుత్వ కాలంలో అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు.. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఆయన మీద కేసు నమోదు అయింది. అయితే దానినుంచి బుకాయిస్తూ.. ఆయన బెయిలు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. సుప్రీం కోర్టులో కూడా ఆయనకు ఊరట లభించలేదు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఏసీబీ కోర్టులో లొంగిపోగా.. రిమాండు విధించారు. ఈ అవినీతి కేసులో.. ప్రభుత్వం చాలా పక్కాగా ఆధారాలన్నీ సేకరించిన తర్వాతనే.. కేసు విషయంలో ముందడుగు వేసింది. కాగా.. దీనినుంచి సంజయ్ బయటపడడం అంత ఈజీ కాదని పలువురు అంచనా వేస్తున్నారు.
అవినీతి కేసులో ఆయన జైలుకు వెళ్లినప్పటికీ.. జగన్ చేతిలో బ్రహ్మాస్త్రంలాగా మారిపోయి, అప్పటి సీఐడీ విభాగానికి చీఫ్ గా వ్యవహరిస్తూ.. జగన్ ప్రత్యర్థుల్ని ఒక రేంజిలో వేధించిన చరిత్ర సంజయ్ సొంతం. ప్రత్యేకించి.. రామోజీరావును, చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకుల్ని వేధించడంలో ఆయన తన జగన్ భక్తిని చాలా పుష్కలంగా ప్రదర్శించుకున్నారు. మార్గదర్శి కేసు విషయంలో ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరించారు. రామోజీరావును అరెస్టు చేసి జైల్లో పెట్టడానికి అన్ని రకాల మార్గాలను అన్వేషించారు. చంద్రబాబును అరెస్టు చేశారు. ఇన్ని చేసినా సరే.. జగన్ కు ఒక దశలో ఆయన సేవలు నచ్చక.. సీఐడీ చీఫ్ పదవినుంచి తప్పించారు. ఆ పదవిలో అత్యంత వివాదాస్పదంగా వ్యవహరించారు.
కూటమి ప్రభుత్వం తమను సీఐడీ చీఫ్ గా సంజయ్ వేధించిన వ్యవహారాలన్నింటినీ కూడా పక్కన పెట్టింది. ఆయన అగ్నిమాపక శాఖలో పాల్పడిన అవినీతి మీద మాత్రమే దృష్టి పెట్టింది. ఆ కేసులోనే ఆయనకు శిక్ష తప్పేలా లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.