మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి నోరు తెరిచారంటే అబద్ధాల పరంపర మొదలవుతుంది. తాను రాష్ట్రాన్ని అయిదేళ్లు పాటు ఉద్ధరించేశానని చెప్పుకునే అబద్ధాలు మాత్రమే కాదు.. ఈ ప్రభుత్వం ఫలానా వర్గాలకు ద్రోహం చేస్తున్నదంటూ నానా రకాల నిందలు వేస్తుంటారు. చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ద్రోహం చేస్తున్నదని, బాబు పాలనలో మహిళల మీద అత్యాచారాలు జరిగాయని కూడా రకరకాల నిందలు వేస్తూ గడుపుతుంటారు. జగన్ పేలే అలాంటి అబద్ధాలకు కౌంటరుగా విరుచుకుపడడానికి, వాస్తవాలతో జగన్ కళ్లు తెరిపించడానికి, ఆయన మాయలనుంచి రాష్ట్రప్రజలను రక్షించడానికి తెలుగుదేశం సేనావాహినిలో మరో ఫిరంగి జత చేరనుంది. మొన్నటిదాకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి నాయకురాలు వాసిరెడ్డి పద్మా తాజాగా తెలుగుదేశంలో చేరడానికి నిర్ణయించుకున్నారు. ముహూర్తం ఇంకా ఖరారు కావాల్సి ఉంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో సమావేశమైన తర్వాత.. ఆమె తెదేపాలో చేరిక ఖరారైంది.
వాసిరెడ్డి పద్మ తొలినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి తొలినుంచి అండగా నిలిచిన నాయకుల్లో ఆమెకూడా ఒకరు. అయితే రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాల్సిన ప్రతి సందర్భంలోనూ జగన్ ఆమెను పక్కన పెడుతూనే వచ్చారు. తీరా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆమెకు మొక్కుబడిగా మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తాను అధికారంలో ఉన్నంత కాలమూ ఒక కులానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన నాయకుడిగా అపకీర్తి గడించిన జగన్మోహన్ రెడ్డి.. వాసిరెడ్డి పద్మను కూడా అదే కారణాల చేత దూరం పెడుతూ వచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో కూడా టికెట్ ఇవ్వలేదు సరికదా.. ప్రచారంలోనూ వాడుకోలేదు.
ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల్లో పరాజయం తర్వాత.. వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేశారు. అయితే మహిళా అంశాల మీద మాట్లాడడంలో వాసిరెడ్డి పద్మకు ఫైర్ బ్రాండ్ గా పేరుంది. ఆమె ఇప్పుడు తెలుగుదేశంలో చేరబోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకు అన్యాయం చేస్తున్నదని మరోసారి జగన్ నోరు విప్పారంటే గనుక, జగన్ హాయాంలో ఎలాంటి ద్రోహాలు జరిగాయో సాధికారికంగా.. గణాంకాలతో సహా వివరించడానికి వాసిరెడ్డి పద్మ సిద్ధంగా ఉంటారు. పైగా జగన్ పాలనలో మహిళా కమిషన్ ఛైర్మన్ చేసిన ఆమెకు.. అప్పట్లో మహిళలపై ఎన్నెన్ని అకృత్యాలు జరిగాయో, ఎన్నింటిని ప్రభుత్వమే అధికారికంగా తొక్కిపెట్టిందో సమస్తమూ పూర్తిగా అవగాహన ఉంటుంది. ఆమె ఫిరంగిలాగా గర్జించడం ప్రారంభిస్తే జగన్ అబద్ధాలకు సరైన విరుగుడు అవుతుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.