ఒక బెయిలు అమలయ్యేలోగా మరో అరెస్టు, రిమాండు!

జగన్ అండ చూసుకుంటూ అయిదేళ్లపాటు ఇష్టారాజ్యంగా చెలరేగిన రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు.. ఏ రకంగా రౌడీలను, సంఘవ్యతిరేక శక్తులను పెంచి పోషించారో, వారిని రాజకీయ నాయకులుగా ప్రమోట్ చేసి ఏ రకంగా ప్రోత్సహించారో తెలుసుకోవడానికి మాచర్ల మునిసిపల్ ఛైర్మన్ గా కూడా పనిచేసిన తురకా కిశోర్ పెద్ద ఉదాహరణ. తెలుగుదేశం నాయకులు మాచర్ల పర్యటనకు వెళితే.. వారి వాహనం మీద దాడికి దిగి విధ్వంసం సృష్టించడం మాత్రమే కాకుండా, వారిని హత్య చేయడానికి ప్రయత్నించిన తురకా కిశోర్ నేరమయ ప్రస్థానం గురించి చెప్పుకుంటూ ఉంటే.. కొండవీటి చాంతాడంత అవుతుంది. అలాంటి తురకా కిశోర్ కు  ఇప్పుడు క్లిష్ట పరిస్థితి ఎదురైంది. పాపం.. ఆయన అతి కష్టమ్మీద కోర్టునుంచి బెయిలు తెచ్చుకోగలిగారు. అయితే విముక్తి లభించేలోగానే.. మరో కేసులో అరెస్టు అయ్యారు. మళ్లీ రిమాండుకు వెళ్లాల్సి వచ్చింది. కాకపోతే.. జైలు మారింది అంతే!

మాచర్ల వైసీపీ నాయకుడు, మునిసిపల్ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డికి అనుంగు సహచరుడు అయిన తురకా కిశోర పలు కేసుల్లో నిందితుడిగా రాజమండ్రి సెంట్రల్ జైలులో చాలాకాలంగా ఉన్నారు. తనపై ఉన్న పీడీయాక్టును తొలగించాలని కోరుతూ ఆయన అడ్వయిజరీ బోర్డును ఆశ్రయించారు. అక్కడనుంచి సానుకూలత లభించింది. బోర్డు సూచనల మేరకు ఈ నెల 12న ఆయన మీద పీడీయాక్టు రద్దయింది. బెయిలు కూడా మంజూరైంది.
అయితే భూకబ్జా, హత్యాయత్నం కు సంబంధించిన మరో కేసులో పోలీసులు ఆయన మీద అదేరోజున పీటీవారంటు దాఖలు చేశారు.

తమ ఇంటి స్థలాన్ని తురకా కిశోర్, ఆయన అనుచరులు కబ్జా చేశారని, చంపేస్తామని బెదిరించారని అంటూ మాచర్లకు చెందిన చల్లా శివకుమార్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. పీటీ వారంటు వేసిన పోలీసులు తురకా కిశోర్ ను మాచర్ల కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి కిశోర్ కు 14 రోజుల రిమాండ్ విధించారు.  దీంతో ఆయన గుంటూరు జిల్లా జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

తురకా కిశోర్ మాచర్లలో అడ్డగోలుగా చెలరేగిపోయిన అసాంఘిక శక్తిగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే పరారీలోకి వెళ్లిన ఆయన అనుకోకుండా పోలీసులకు చిక్కారు. ఆయన మీద అనేక కేసులు ఉండగా.. అప్పటినుంచి రాజమండ్రి జైల్లోనే ఉన్నారు. ఇన్నాళ్లకు పీడీయాక్టునుంచి విముక్తి రూపేణా బెయిలు వచ్చింది గానీ.. గతంలోచేసిన అక్రమాలు పుంఖాను పుంఖాలుగా ఉండడంతో మరో కేసులో మరో జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

Related Posts

Comments

spot_img

Recent Stories