వైసీపీలో వెలుగులోకి వచ్చిన మరో అనంతబాబు!

దళిత యువకుడిని హత్య చేయించడం అనేది ఒక లక్షణంగా పరిగణిస్తే గనుక.. దానికి తన సొంత ముద్ర జత చేసి, శవాన్ని డోర్ డెలివరీ కూడా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును ఆ లక్షణానికి ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకోవాలి. అలాంటిది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే మరో అనంతబాబు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. కాకపోతే ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. హత్య చేయించిన భావినాయకుడు కూడా దళితుడే. అమలాపురం నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచి, జగన్ జమానాలో మంత్రిగా కూడా పనిచేసిన పినిపె విశ్వరూప్ కుమారుడు పినిపె శ్రీకాంత్.. కోనసీమ అల్లర్ల సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీరు, దళితుడు అయిన దుర్గాప్రసాద్ ను హత్య చేయించినట్టుగా వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల కిందట జరిగిన ఈ దళిత యువకుడి హత్యోదంతం సహజంగానే వైకాపా పాలనలో మరుగున పడిపోయింది.  మంత్రి సుభాష్ చొరవతో పోలీసులు తిరగతోడడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, హత్యకు గురైన దుర్గాప్రసాద్ కు స్నేహితుడు అయిన వడ్డి ధర్మేశ్ ను ఇటీవల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. వారి విచారణలో.. అప్పట్లో మంత్రిగా కూడా ఉన్న పినిపె విశ్వరూప్ కొడుకు శ్రీకాంత్ పురమాయింపుతోనే హత్య జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది.

దళితయువకుడు దుర్గాప్రసాద్ హత్యకు దారితీసిన అసలు కారణాల గురించి ఇంకా స్పష్టత రాలేదు. కాకపోతే.. దుర్గాప్రసాద్.. హత్య చేయించిన పినిపె శ్రీకాంత్, హత్యలో పాల్గొన్న వడ్డి ధర్మేష్ ఇద్దరికీ స్నేహితుడేనని, వారితో సన్నిహితంగా ఉండేవారని తెలుస్తోంది. దుర్గాప్రసాద్ ను చంపేయాలనుకున్న శ్రీకాంత్.. ధర్మేశ్ తో పాటు మరో నలుగురి ద్వారా ఆ పనిచేయించినట్టు వెలుగులోకి వస్తోంది.

2022 జూన్ లో దుర్గాప్రసాద్ ను వడ్డి ధర్మేశ్ తనతో కోటిపల్లి రేవు వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడకు వచ్చిన మరో నలుగురు వారిని పడవలో లోపలకు తీసుకువెళ్లారు. వారిలోని ముగ్గురు దుర్గాప్రసాద్ మెడకు తాడు బిగించి హత్యచేసేశారు. మృతుడి భార్య శ్రావణ సంధ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కొన్నాళ్లకు మృతదేహం దొరకడంతో హత్య సంగతి తేలింది.

చాలా సహజంగానే.. ఈ దళిత యువకుడి హత్య కేసు విచారణ జగన్ పాలనలో వెనక్కు వెళ్లిపోయింది. బాధితులు, దళిత నాయకులు ఎన్నిసార్లు పోలీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాధితుల కుటుంబ సభ్యులు మంత్రి వాసంశెట్టి సుభాష్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన స్వయంగా డీజీపీని కలిసి వివరాలు తెలియజేయడంతో కేసులో మళ్లీ కదలిక వచ్చింది. వడ్డి దర్మేశ్ ను విచారించాక అన్ని వివరాలు తెలిశాయి. తాజాగా పినిపె విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ పాత్ర కూడా పోలీసుల విచారణలో తేలినట్టే. ‘నా ఎస్సీలు’ అని రొమ్ము విరుచుకుని వేదికల మీద చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి.. కనీసం దళిత యువకుల హత్యల కేసులను కూడా పరిష్కరించలేకపోవడం వెనుక కేవలం తన పార్టీ వారే నిందితులు కావడమే కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories