అన్నా చెల్లెళ్ల పోరు తాళలేక అమెరికాకు విజయమ్మ!

తల్లిదండ్రులు విడిపోయే సందర్భాలలో ఊహ తెలిసిన పిల్లలు ఎవరి దగ్గర ఉండడానికి ఇష్టపడితే వారివైపు న్యాయం ఉన్నట్టు లెక్క. అదే తరహాలో పిల్లలు విడిపోయినప్పుడు.. తల్లిదండ్రులు ఎవరి వెంట ఉండదలచుకుంటే వారివైపు న్యాయం ఉన్నట్టు లెక్క. ఆ ప్రకారం చూసినప్పుడు.. గత కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డికి దూరంగా, షర్మిల వెంట మాత్రమే ఉంటూ, షర్మిల కోసం రోడ్డెక్కి  ధర్నాలు కూడా చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ రాష్ట్రప్రజలకు స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. న్యాయం ధర్మం షర్మిలవైపు ఉన్నట్టుగానే ఆమె ఇన్నాళ్లూ అన్యాపదేశంగా చెప్పేశారు. అయితే ఇప్పుడు ఎన్నికల సీజను వచ్చింది.

జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చిన్న అవకాశాన్ని కూడా చేజార్చుకోవడానికి ఇష్టపడరు. అలాంటిది తల్లి ప్రచారం ద్వారా రాగల ఎడ్వాంటేజీని ఎందుకు వద్దనుకుంటారు. ఇన్నాళ్లుగా తల్లిని విస్మరించినప్పటికీ.. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో వైసీపీ తరఫున ప్రచారం చేయాలంటూ జగన్ ఒత్తిడి చేయడంతో.. అన్నాచెల్లెళ్ల మద్య పోరులో తాను తాళలేక.. విజయమ్మ అమెరికాలోని బంధువుల వద్దకు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.

2019 ఎన్నికల తర్వాత.. జగన్ షర్మిల మధ్య విభేదాలు పెరిగి వారు ఎడంగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయ్యాక కొన్నాళ్లు ఆయనతో పాటు ఉన్న విజయమ్మ తర్వాత హైదరాబాదులోని కూతురు దగ్గరకు వచ్చేశారు. తాడేపల్లిలో ఉండగా.. అమరావతి రాజధాని నిర్మాణానికి ఆమె అనుకూలంగా ఉన్నారని కూడా వినిపించింది. సగంలో ఉన్న అమరావతి రాజధాని భవనాలను ఆమె స్వయంగా ఆ ప్రాంతంలో తిరిగి పరిశీలించి.. పూర్తిచేయాల్సిందిగా జగన్ కు చెప్పినట్టు కూడా వినిపించింది. తర్వాత కొడుకునుంచి దూరం జరిగారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టాక.. వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసి, ఆ పార్టీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసి, కూతురు వెంట ఉన్నారు.

తీరా ఇప్పుడు షర్మిల కడప ఎంపీగా బరిలో ఉండడం, జగన్ మీద విమర్శలు కురిపిస్తూ ఉండడంతో విజయమ్మకు సంకట స్థితి ఎదురైంది. తనతో ప్రచారానికి రావాల్సిందిగా కూతురు, తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించాలని కొడుకు ఇద్దరి నుంచి ఆమె మీద ఒత్తిడి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేక విజయమ్మ అమెరికాలోని బంధువుల వద్దకు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories