అనిత హామీ.. ముందు ఆ పని చేయాలి!

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైఎస్ రష్మిలకు అన్యాయం జరిగినా కూడా ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకుంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత అంటున్నారు. శాసనమండలిలో మహిళల భద్రతకు తమ ప్రభుత్వం ఎంతగా కట్టుబడి ఉన్నదో తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ అనిత ఈ మాటలు అన్నారు. అయితే.. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తల్లికి, చెల్లెలికి అన్యాయం జరిగితే.. అప్పుడు రక్షణ కల్పించడం అనే ధోరణిలో కాకుండా.. ముందస్తుగానే వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్రంలో ప్రజలు భావిస్తున్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో ఆస్తుల ముసలం ఇప్పుడు తారస్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ బతికి ఉండగా సమకూరిన ఆస్తులపై పిల్లలు ఇద్దరికీ సమాన వాటా ఉన్నదని, తన తండ్రి కోరిక అదేననే వాదనతో షర్మిల, వైఎస్ఆర్ భార్య విజయమ్మ  మాట్లాడుతున్నారు. అయితే ఆయన జీవించి ఉన్న సమయంలో సమకూరిన ఆస్తులు కూడా కొన్ని పూర్తిగా తనవేనని జగన్ వాదిస్తున్నారు. మొత్తానికి ఈ పంచాయితీ ట్రిబ్యునల్ మరియు కోర్టుల పరిధిలో ఉంది. కాగా.. ఆస్తుల వివాదం మొదలైన నాటినుంచి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా ఉన్మాదులు.. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ల గురించి అత్యంత అసభ్యకరమైన పోస్టులు పెడుతూ చెలరేగుతున్నారు. వాళ్లిద్దరి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో వారిద్దరికీ కూడా వైసీపీ ఉన్మాదుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నదని ఎవరికైనా అనిపిస్తుంది.

వైఎస్ షర్మిల కోరినట్లయితే ఆమెకు అదనపు భద్రత కల్పించడానికి కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఇటీవల డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు హోంమంత్రి వంగలపూడి అనిత వారిద్దరికీ అన్యాయం జరిగితే రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం అని అంటున్నారు. నిజం చెప్పాలంటే వారికి అన్యాయం జరిగే వరకు ఈ ప్రభుత్వం వేచిచూస్తూ కూర్చోవడం అనవసరం. అధికారంలో లేం అనే ఉద్దేశంతో ఒక రకమైన ఉన్మాదంతో వైసీపీ శ్రేణులు రాష్ట్రంలో ప్రవర్తిస్తున్న సంగతిని అందరూ గమేనిస్తున్నారు. జగన్ తో వైరం పెట్టుకున్న కేసులు నడుపుతున్న ఆయన తల్లి, చెల్లిలకు కూడా ఈ వైసీపీ ఉన్మాదులు ఎలాంటి ప్రమాదమైన తలపెట్టే అవకాశం ఉంది. వారిద్దరికీ వీసమెత్తు అపాయం జరిగినా అది ప్రభుత్వ వైఫల్యం కిందకు వస్తుంది. అందుకే ముందుగా వారికి అదనపు భద్రత కల్పించాలని, కనీసం అదనపు భద్రత కల్పిస్తాం.. అని వారిద్దరికీ పోలీసులనుంచి లేఖరాసినా బాగుంటుందని.. వారు వద్దంటే మిన్నకుండిపోవచ్చునని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories