‘కాసు’ మీద గుస్సా.. జగన్ కే చేటు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. సహజంగానే ఇలాంటి ఓటమి పలకరించినప్పుడు.. ఒక్కొక్కరూ ఒక్కొక్క లోపాన్ని ప్రస్తావిస్తూ బోలెడు మాట్లాడుతుంటారు. తమ పాత్ర తప్ప.. ఇతరుల ఘన కార్యాలవల్లనే ఓడిపోయాం అంటూ సెలవిస్తూ కూడా ఉంటారు. అయితే క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషణలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని పార్టీ అధినేత ఖచ్చితంగా పరిగణించే తీరాలి. ఆ మాటలను కూడా చెవిన వేసుకోకుండా, లోపాలు చెప్పిన వారి మీద గుస్సా అయితే నష్టం జరిగేది ఎవ్వరికి? పార్టీ అధినేతకే కదా! ఆ విషయాన్ని జగన్ గుర్తించడం లేదు.

వైసీపీ ఓటమి గురించి ఆ పార్టీ నాయకులే రకరకాల విశ్లేషణలు చెబుతున్నారు. కొందరు కేవలం జగన్ సహాయకుడు ధనంజయరెడ్డి, సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి వల్ల మాత్రమే ఓడిపోయాం అంటూ ఆరోపించారు. చాలా మంది ఆఫ్ ది రికార్డుగా ఓటమికి దారితీసిన కారణాలుగా బోలెడు చెబుతున్నారు. కానీ.. ఆన్ రికార్డు.. వీడియో సందేశంలో.. తమ సొంత పార్టీ ఓటమి గురించి గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సరైన రీతిలో కొన్ని కారణాల్ని విశ్లేషించారు.

మద్యం, ఇసుక విధానాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, తెలుగుదేశం నుంచి తమ పార్టీలోకి వచ్చి చేరిన కొందరునేతలు చంద్రబాబునాయుడును అవమానించిన తీరు ఇవన్నీ కలిసి తమ పార్టీని దారుణంగా ఓడించాయని మహేష్ రెడ్డి వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ఎంత సంక్షేమం చేసినా వాటిలో ఉన్న లోపాల్ని అధిగమించలేకపోయాం అని కూడా ఒప్పుకున్నారు.

అయితే, బహిరంగంగా వీడియో సందేశం ద్వారా.. పార్టీ ఓడిపోవడానికి ఈ కారణాల్ని చెప్పినందుకు కాసు మహేష్ రెడ్డి మీద ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో కోపగించుకున్నారని తెలుస్తోంది. జగన్ ఆగ్రహాన్ని ఆయన వెంట ఉన్నారు కాసు మహేష్ రెడ్డికి తెలియజేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి.. ఈవీఎంలలో జరిగిన మోసం వల్ల మాత్రమే తమ పార్టీ ఓడిపోయినట్టుగా ప్రజలను నమ్మించడానికి తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో.. సొంత పార్టీలోని సొంత సామాజిక వర్గానికి చెందిన కీలక నేత.. ఇలాంటి కారణాలను క్రోడీకరించడం జగన్ కు మింగుడుపడలేదని, అందుకే గుస్సా అయ్యారని తెలుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories