జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో.. ప్రధానంగా పోలీసు వ్యవస్థ ఎంతగా గాడి తప్పి వ్యవహరించిందో ప్రజలందరికీ తెలుసు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పోలీసుల పనితీరు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నేపథ్యంలో వారి పనితీరు మొత్తం మరోసారి చర్చకు వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో డీజీపీ ద్వారకా తిరుమల రావు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలపై వివరణ ఇవ్వడం ఒక ఎత్తు అయితే.. గత ప్రభుత్వం కాలంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండడం అనేది హైలైట్! నియమ నిబంధనలతో పనిలేకుండా అప్పటి పోలీసులు ఎంతగా బరితెగించి పనిచేశారనడానికి ఇదే ఉదాహరణ.
తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగితే.. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు.. తెదేపా నాయకుడు రెచ్చగొట్టేలా మాట్లాడినందువల్లనే ఇలా జరిగిందని కేసు డైరీలో రాసి క్లోజ్ చేశారట. అసలు ఇలా ఎక్కడైనా పోలీసులు పనిచేస్తారా? అంటూ ఇప్పుడు డీజీపీ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు అరెస్టులు చేస్తూంటే నిలదీస్తున్నారని.. నేరం తేలితే.. ముప్పయ్యేళ్ల తర్వాతనైనా అరెస్టులు తప్పవని ఆయన హెచ్చరిస్తున్నారు. పోలీసుల వ్యవహారసరళి అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.
ఎంపీ రఘురామక్రిష్ణరాజును పోలీసులు విచారణ పేరుతో దారుణంగా హింసించిన వైనంపై కూడా ఎవరూ పట్టించుకోలేదని డీజీపీ చెబుతుండడం గమనించాలి. ఆ ఫిర్యాదులను కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని అంటున్నారు. అప్పటి పోలీసుల వైఖరిపై ఇప్పటికైనా పోలీసులు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఆయన అంటున్నారు.
డీజీపీ నిజానికి కొన్ని విషయాలను మాత్రమే ప్రస్తావించారు. కాదంబరి జెత్వానీ కేసు దగ్గరినుంచి, స్థానికంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఊడిగంచేస్తూ పోలీసులు శాంతి భద్రతలను నాశనం చేసిన పరిస్థితి వరకు ఎన్నో అరాచకాలు జరిగాయి. అప్పటి అరాచకాలు అన్నింటికీ కూడా ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ బాధ్యత తీసుకోవాలి. ఆ అరాచకాల బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. లేకపోతే పోలీసుల మీద ప్రజలకు నమ్మకం పోతుందని పలువురు భావిస్తున్నారు.