90 రోజుల్లోగా అనంతబాబు సంగతి తేలుతుంది!

అధికారం తమ చేతిలోనే ఉన్నది కదాని హత్యలు చేసి యథేచ్చగా తప్పించుకోవచ్చునని ఎవరైనా అనుకుంటే పొరబాటు. చేసిన పాపం ఎన్నటికీ వెన్నాడుతూనే ఉంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జమానాలో ఎమ్మెల్సీగా కూడా వెలగబెట్టిన జగన్ కు అత్యంత సన్నిహితుడైన అనంతబాబు విషయంలో ఈ సిద్ధాంతం తాజాగా నిరూపణ అవుతోంది. దళితుడైన తన డ్రైవరు అనంతబాబును చంపేసి, వాళ్ల ఇంటికే డోర్ డెలివరీ చేసిన వ్యక్తి అనంతబాబు. ఈ కేసును పునర్విచారణ చేయడానికి రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టు అనుమతి ఇచ్చింది. 90 రోజుల్లోగా సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. జగన్ పాలనలో తనకేం కాదనే ధీమాతో చెలరేగిన అనంత బాబు ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లక తప్పదనే చర్చలు షురూ అయ్యాయి.

2022 మే 19న కాకినాడలో డ్రైవరు సుబ్రమణ్యం హత్య జరిగింది. హత్య తానే చేసినట్టుగా అనంతబాబు అంగీకరించారని కూడా అప్పటి ఎస్పీ మీడియా సమావేశంలోనే వెల్లడించారు. ఆయనకు మధ్యంతర బెయిలు వచ్చింది. బెయిలు రావడాన్నే ఒక పెద్ద వేడుకలాగా జరుపుకున్నారు అనంతబాబు. పెద్ద ఊరేగింపుగా జైలునుంచి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఈ కేసు పురోగతి ఏమీ లేకుండా అటకెక్కింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత.. తమకు న్యాయం చేయాలని, సీబీఐ విచారణ జరిపించి అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరింది. కూటమి సర్కారు వారి కుటుంబానికి పరిహారం అందించడంతో పాటు న్యాయ సలహాకు ఒక న్యాయవాదిని కూడా నియమించింది. దర్యాప్తుకోసం ఒక సిట్ ఏర్పాటు అయింది.

కేసును సమగ్రంగా దర్యాప్తు చేయడానికి సిట్ ఎస్సీ ఎస్టీ కోర్టును అనుమతి కోరగా.. తాజాగా అనుకూలంగా తీర్పు వచ్చింది. 90 రోజుల్లోగా సప్లిమెంటరీ చార్జిషీటు వేయాలని కోర్టు ఆదేశించింది. అంటే అనంతబాబుకు కౌంట్ డౌన్ మొదలైనట్లే అని నిపుణులు భావిస్తున్నారు. హత్యలో ఆయన పాత్ర చాలా స్పష్టంగా ఉండగా.. జగన్ పాలన కాలంలో అతడిని కాపాడే ప్రయత్నం జరిగింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగడం వలన.. వాస్తవాలన్నీ ఎలాంటి ఇబ్బందిలేకుండా బయటకు వస్తాయని అంతా భావిస్తున్నారు. ఇప్పుడు ఏర్పాటైన సిట్ దర్యాప్తు పూర్తి చేయడానికి తీసుకునే 90 రోజుల వ్యవధి మాత్రమే అనంతబాబు నిశ్చింతగా బయట ఉండగలరని.. ఆ తర్వాత జైలుకు వెళ్లకతప్పదని పలువురు అంచనా వేస్తున్నారు.

అనంతబాబు ఈలోగా విదేశాలకు పారిపోయే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో.. పోలీసులు లుకౌట్ నోటీసు కూడా జారీచేసే అవకాశం ఉందని అంటున్నారు. చేసిన హత్యకు శిక్ష అనుభవించి తీరాల్సిందేనని ఎప్పటికి తేలుతుందో వేచిచూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories