అనంత్ బాబు మరోసారి అరెస్టుకు సిద్ధం కావాల్సిందే!

చేసిన నేరానికి ఒకసారి అరెస్టు అయ్యారు.. బెయిలుపై విడుదలయ్యారు.. ఆ విడుదలోత్సవాన్ని బీభత్సమైన వేడుకగా నిర్వహించుకున్నారు.. అధికారంలో ఉన్నది ఎటూ తన జగనన్నే కదాని.. ఇక ఎప్పటికీ తనకు తిరుగు ఉండదని అనుకున్నారు. కానీ కాలం వికటించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆయన చేసిన నేరాన్ని తిరగతోడుతుండేసరికి ఆయన సహించలేకపోయారు. అందుకే.. పునర్విచారణ జరగకుండా స్టే ఇవ్వాలనే డిమాండుతో హైకోర్టును ఆశ్రయించారు. ఇదేమీ ఆషామాషీ రాజకీయ ఆరోపణల కేసు కాదు.. దళితయువకుడి హత్య కేసు. అలా కుదరదు పొమ్మని హైకోర్టు పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి అరెస్టు కావడానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

2019 మే 19న కాకినాడలో దళితుడైన డ్రైవరు సుబ్రమణ్యం హత్య జరిగింది. డ్రైవరును హత్యచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అనంతబాబు మృతదేహాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేయడం సంచలనం రేకెత్తించింది. ఆయన తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని అప్పట్లో పోలీసులు ప్రకటించారు గానీ.. ఆయనకు బెయిలు వచ్చిన తర్వాత అంతా నీరుగారిపోయింది. న్యాయం కావాలని కోరుతున్న హతుడి కుటుంబం గోడును ఎవ్వరూ పట్టించుకోలేదు.

ఈ హత్య విషయంలో న్యాయంచేస్తామని, కేసును మళ్లీ విచారించేలా చూస్తామని ఎన్నికల సమయంలో ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వారి కుటుంబానికి న్యాయసహాయం అందించడానికి న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును నియమించారు. అలాగే వారి కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు ఒకరికి ఉద్యోగం కూడా ఇచ్చారు. పునర్విచారణకు ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్ వేయగా అందుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. 90 రోజుల్లోగా పునర్విచారణను ఒక దశకు తీసుకువచ్చి సప్లిమెంటరీ చార్జిషీటు వేయాలని కోర్టు ఆదేశించింది.

ఈ ఆదేశాలు ఎమ్మెల్సీ అనంతబాబుకు మింగుడుపడలేదు. పునర్విచారణ అంటే తన బాగోతం మొత్తం బయటకు వస్తుందని ఆయన భయపడ్డారు. మళ్లీ అరెస్టు కాక తప్పదని ఆందోళనలోపడ్డారు. ఈ నేపథ్యంలో అసలు పునర్విచారణకు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ కోర్టు ఉత్తర్వులపై స్టే కావాలంటూ.. హైకోర్టును ఆశ్రయించారు. ఆయనలో అరెస్టు భయం అపరిమితంగా ఉన్నదేమో గానీ.. గురువారం కోర్టు తలుపు తట్టి.. ఆ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని కూడా కోరారు. కానీ.. కోర్టు శుక్రవారం విచారించింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసులో తదుపరి విచారణ నిరభ్యంతరంగా కొనసాగించవచ్చునని స్నష్టం చేసింది.

ఇది కేవలం ఎమ్మెల్సీ అనంతబాబుకు మాత్రమే కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పలువురికి చేదువార్త.  పోలీసులు ఇప్పుడు ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నదని, 90 రోజుల్లో సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేసేలోగా అరెస్టు చేసే అవకాశం కూడా ఉన్నదని న్యాయనిపుణులు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories