నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఆనం రామనారాయణరెడ్డి చాలా సీనియర్లలో ఒకరు. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు 4.0 ప్రభుత్వంలో సీనియర్లకు చాలా పరిమితంగా మాత్రమే మంత్రివర్గంలో స్థానం కల్పించినప్పటికీ, రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులను ఆశిస్తున్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నప్పటికీ.. ఏడాది కిందట మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం లోకి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టారు. కాగా ఇప్పుడు ప్రభుత్వం లో కీలకంగా ఉన్న ఆనం తన సొంత జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల సమయంలో విసిరిన సవాళ్లను గుర్తు చేసి ఆయనను హేళన చేస్తున్నారు.
అనిల్ కుమార్ యాదవ్ మంత్రివర్గంలో తనకు ఎన్నడూ సహచరుడు కాదని, ఒకే వేదిక మీద ఆయన పక్కన కూర్చునే భాగ్యం తనకు ఎన్నడూ దక్కలేదని ఆనం రామనారాయణరెడ్డి వెటకారం చేస్తున్నారు. అదే క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ చేసిన సవాళ్లను గుర్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం లో చేరిన ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు గెలిచినా సరే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అనిల్ కుమార్ యాదవ్ అప్పట్లో సవాలు విసిరారు. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం లోకి వస్తే చంద్రబాబు నాయుడు కేవలం ఇద్దరికీ మాత్రమే టికెట్లు ఇచ్చారు. ఆ ఇద్దరూ ఆనం రామనారాయణరెడ్డి మరియు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి! ఇద్దరూ కూడా ఘన విజయం సాధించారు! ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ సన్యాసం తీసుకోవాలివాల్సిన బాధ్యతను ఆనం రామనారాయణ రెడ్డి గుర్తు చేస్తున్నారు.
రాజకీయాల్లో విసిరిన సవాల్ మీద నిలబడి పరువు కాపాడుకునే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. అనిల్ రాజకీయ సన్యాసం సంగతి పక్కన పెడితే ఆయన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం 10 నుంచి 20 సీట్లను కోల్పోయిందని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించడం వలన ఆ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే సీట్లు అన్నింటిని వైసీపీ కోల్పోయింది. అక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలను మారిస్తే తమకు కష్టమని సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా జగన్ వినిపించుకోకపోవడం వలన వచ్చిన ప్రమాదం ఇది.
అలాగే ఆయనను నరసరావుపేట ఎంపీగా పంపడం వలన అనిల్ కుమార్ డిమాండ్ కు జగన్మోహన్ రెడ్డి తలొగ్గి ఆయన అనుచరుడికే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ టికెట్ను తాను సూచించిన వ్యక్తికి ఇవ్వలేదని అలకపూని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశం లోకి వెళ్లారు. ఆ ప్రభావం నెల్లూరు జిల్లా మొత్తం పార్టీ అభ్యర్థుల మీద పడింది. ఆయన తన భార్యతో సహా జిల్లాలో ఎంపీ స్థానాలు అన్నింటినీ కూడా గెలిపించుకున్నారు. మరోవైపు నరసరావుపేట ఎంపీగా తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని కూడా అనిల్ కుమార్ యాదవ్ ప్రచార సమయంలో సవాలు విసిరారు. తీరా సవాళ్లు మిగిలాయే తప్ప వాటిని ఆచరించే నిజాయితీ ఎక్కడ కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.