ఆనం వారు విడుదల చేస్తున్న ‘నెల్లూరు సిత్రాలు’!

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక చిత్రాలు చోటుచే సుకున్నాయి. ఈ భాగోతాలను తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకులు వెంకటరమణారెడ్డి విడుదల చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ మునిసిపల్ శాఖ మంత్రిగా ఉండగా ఎన్ని అరాచకాలు జరిగాయో పూసగుచ్చినట్టుగా చెబుతున్నారు. ఒక్క మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏకంగా 110 కోట్ల రూపాయల దందా జరిగిందంటే.. ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే! ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో నిబంధనలు పాటించకుండా చేయడం, తాకట్టులో ఉన్న ఆస్తులను విడుదల చేయడం ద్వారా అప్పటి అధికారులు బిల్డర్లతో కుమ్మక్కయి ఈ మేరకు అవినీతి చేసినట్లుగా రమణారెడ్డి బయటపెడుతున్నారు.

వెంకటరమణారెడ్డి ట్వీట్ పుణ్యమా అని జాయింట్ కలెక్టర్ గా పోస్టింగ్ పొందిన తర్వాత కూడా హరిత అనే ఐఏఎస్ అధికారి పోస్టింగ్ కోల్పోయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ పార్టీ నాయకులతో అంటకాగుతూ అరాచకాలకు పాల్పడిన ఆమెకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జేసీగా పోస్టింగ్ ఇచ్చింది. పోస్టింగ్ ఇచ్చిన తరువాత వెంకటరమణారెడ్డి ఆమె గత ప్రభుత్వంలో చేసిన వ్యవహారాలపై ట్వీట్ పెట్టడంతో మేలుకున్న సర్కారు ఆమెను పక్కనపెట్టింది.

అలాంటి వెంకటరమణారెడ్డి ఇప్పుడు నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన అరాచకాలను బయటపెడుతున్నారు. వీటి మీద సమగ్ర విచారణ జరిపితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.
బిల్డర్లు నిర్మాణాలు చేసేటప్పుడు తాకట్టు పెట్టిన భూములను నిబంధనల మేరకు పరిశీలన జరగకుండానే విడుదల చేసినట్లుగా ప్రధాన ఆరోపణ వినిపిస్తోంది. అలాగే పన్నులు విధించే విషయంలో కూడా అవకతవకలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. లక్షన్నర రూపాయలు పన్ను చెల్లిస్తున్న వారికి దానిని సవరించి కేవలం 40,000 పన్ను విధించడం ఒక కామెడీ అయితే, మునిసిపాలిటీ నే వారికి ఏకంగా ఐదు లక్షల రూపాయల బాకీ పడటం అనేది చిత్రం కాక మరేమిటి? ఇలాంటి నెల్లూరు చిత్రాలు అనేకం వెంకటరమణారెడ్డి సాక్ష్యాధారాల సహా బయట పెడుతున్నారు. డాక్యుమెంటరీ ఆధారాలను కూడా ఆయన ప్రెస్ మీట్లో ప్రదర్శించడం విశేషం. అయితే వెంకటరమణారెడ్డి ప్రభుత్వానికి మరొక హెచ్చరిక కూడా చేస్తున్నారు. త్వరలోనే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో అగ్ని ప్రమాదం జరగబోతున్నదని అంటున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్నిప్రమాదాలు జరగడం- ఫైల్స్ మాయం కావడం, దగ్ధమైపోవడం అనేది రివాజుగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. నెల్లూరు మునిసిపాలిటీలో గత ప్రభుత్వ హయాంలో ఏకంగా 110 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని అనుకుంటుండగా అక్కడ అగ్నిప్రమాదం జరుగుతుందని ఆయన చెప్పడంలో అంతరార్థం ఫైల్స్ తగలబెట్టడానికి అవినీతికి పాల్పడిన సిబ్బంది కుట్ర చేస్తున్నట్టుగా అనుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ముందే జాగ్రత్త పడి చర్యలు తీసుకుంటే కనీసం అగ్ని ప్రమాదం జరగకుండా ఆపడం సాధ్యమవుతుందని స్థానిక ప్రజలు సలహా ఇస్తున్నారు. సర్కారు ఏం చేస్తుందో చూడాలి!

Related Posts

Comments

spot_img

Recent Stories