వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో అవినీతి తిమింగలం.. నెమ్మదిగా పరారయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. కాకపోతే చాలా జాగ్రత్తగా తెలివితేటలతో వైద్యం ముసుగులో పరారు కావడానికి, దేశం విడిచి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలమూ విచ్చలవిడిగా చెలరేగిపోతూ, నోటికి ఫిల్టర్ లేకుండా పచ్చిబూతులతో చంద్రబాబునాయుడును, నారా లోకేష్ ను, పవన్ కల్యాణ్ ను తూలనాడుతూ.. జగన్ కళ్లలో ఆనందం చూడడానికి తపించిపోయిన కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అనే నాని.. ఇప్పుడు జాగ్రత్త పడే పరిస్థితిలో ఉన్నారు. జగన్ జమానాలో తనకంటె చిన్న చిన్న పాపాలు చేసిన వారు కూడా.. ఇప్పుడు పోలీసుల ఉచ్చులో చిక్కుకుని, తమ పాపాలకు పశ్చాత్తాపపడుతూ విలవిలలాడుతున్న సమయంలో.. తన వంతు రావడానికి ఎంతో దూరం లేదని గ్రహించిన కొడాలి నాని.. మెరుగైన వైద్య చికిత్స కోసం అనే సాకుతో అమెరికాకు పారిపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
కొడాలి నానికి కొంతకాలం కిందట గుండెకు సంబంధించి అనారోగ్యంతో హైదరాబాదులోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజుల తర్వాత ఆయనను శస్త్రచికిత్స నిమిత్తం ముంబాయికి తరలించారు. అక్కడ శస్త్రచికిత్స జరిగిందని, కోలుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లూ ముంబాయిలోనే ఉండి.. ప్రస్తుతం హైదరాబాదు చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారని.. మెరుగైన వైద్యచికిత్స కోసం త్వరలోనే అమెరికాకు వెళ్లే ప్లాన్ తో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తనకు అత్యంత సన్నిహితులు అయిన కొందరు పార్టీ నాయకులను తప్ప ఎవ్వరినీ కలవడం లేదని కూడా తెలుస్తోంది. అయితే ప్రజలు మాత్రం.. వైద్యం ముసుగులో దేశం వదలి పరారు కావడానికే ఆయన ఎత్తుగడ వేసినట్టుగా, ఆ ముసుగులో ఎక్కువ కాలం అమెరికాలోనే గడిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా అనుమానిస్తున్నారు.
హైదరాబాదులోని ఏఐజీ ఆస్పత్రిలోనే దేశంలోని పెద్దపెద్ద ప్రముఖులు కూడా వచ్చి వైద్యం చేయించుకుంటూ ఉంటారు. అలాంటిది ఇక్కడ సాధ్యం కాని శస్త్రచికిత్సకు ముంబాయి వెళ్లడం అంటేనే అప్పట్లో రకరకాల పుకార్లు వచ్చాయి. కూటమి ప్రభుత్వం తనను ఎక్కడ టార్గెట్ చేస్తుందో అనే భయంతో అనారోగ్యం ఎత్తుగడ వేశారని అంతా అనుకున్నారు.
కొడాలి నాని గత ప్రభుత్వ కాలంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ప్రతిపక్ష నాయకుల మీద అత్యంత నీచమైన బూతులతో విరుచుకుపడడం మాత్రమే కాదు. మట్టి, ఇసుక సహా అనేక అక్రమాల కేసులు ఆయన మీద ఉన్నాయి. వీటిపై ప్రస్తుతం విజిలెన్స్ విచారణ సాగుతోంది. త్వరలోనే ఆ విచారణలో ఒక కొలిక్కి వస్తాయని, నివేదికలు రాగానే కేసులు నమోదు అవుతాయని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని అమెరికా ప్రయాణం కబురు వింటే పరారవడానికి రంగం సిద్ధం చే సుకుంటున్నట్టే అని అంతా భావిస్తున్నారు.