తెలుగుదేశం పార్టీ జనాకర్షక హామీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ జడుసుకుంటున్నదన్న మాట నిజం. ఎందుకంటే అవి సర్వ జనమోదయోగ్యమైన హామీలుగా ప్రజలకు చేరువ అవుతున్నాయి. ఈ హామీల దెబ్బకు తమ పార్టీ పుట్టి మునుగుతుందేమో అని భయపడుతున్న అధికార పక్షం.. ఎన్డీయే కూటమి పార్టీల్లో హామీల గురించి ముసలం పుట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కూటమి పార్టీల మధ్య హామీలపై విభేదాలు ఉన్నట్టుగా ప్రచారం చేయడానికి తపన పడుతున్నారు. ఆయన ట్విట్టర్ లో బిజెపి రాష్ట్ర సారథి దగ్గుబాటి పురంధేశ్వరికి ఒక సవాలు విసిరారు. ఆ ట్వీట్ ను గమనిస్తే చాలు.. చంద్రబాబు చెబుతున్న ఏఏ హామీలకు అధికారపార్టీ ఎక్కువగా భయపడుతున్నదో మనకు అర్థం అయిపోతుంది.
ఈ ట్వీట్ లో .. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి మహిళకు 1500 రూపాయలు ప్రతి నెలా అందివ్వడం, అలాగే అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు గురించి ప్రస్తావిస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబు హామీలు మాత్రమేనా.. లేదా మూడు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టోలో భాగమా అనే సంగతి పురంధేశ్వరి తేల్చిచెప్పాలని విజయసాయి కోరుతున్నారు.
ఇలాంటి డిమాండ్ చేయడంలో ఒక మర్మం ఉంది. ఒకవేళ ఉమ్మడి మ్యానిఫెస్టోలో భాగం అని ఆమె అంటే.. ఇదే హామీలు ఇతర రాష్ట్రాల్లో బిజెపి ఎందుకు ఇవ్వడం లేదని ఇరికిస్తారు. కాదు అనిఅంటే.. బాబు వాటిని అమలు చేయరని.. కూటమి పార్టీల మీదకు సాకునెట్టేసి తప్పించుకుంటారని వక్రభాష్యం చెబుతారు. మొత్తానికి బాబు హామీలే పునాదిగా కూటమి పార్టీల్లో ముసలం పుట్టించేందుకు విజయసాయి విఫలయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయాస గమనిస్తే ఈ హామీల గురించి ఎంతగా భయపడుతున్నారో అర్థమౌతుంది.