ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొత్త బార్ పాలసీని తీసుకువచ్చింది. ఈ బార్ పాలసీని కేబినెట్ కూడా ఆమోదించింది. ఆ పాలసీ ప్రకారం.. బార్ లైసెన్సులు ఇవ్వబోతున్నారు. బార్ లైసెన్సు ఫీజును 5 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఉదయం 10 గంటలనుంచి రాత్రి 11 గంటల వరకు బార్లను తెరిచిఉంచవచ్చునని నిర్ణయించారు. బార్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వాలనే ప్రతిపాదనను రాష్ట్రమంత్రివర్గం ఆమోదించింది. స్తూలంగా చూసినప్పుడు.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో.. మద్యం విషయంలో అరాచకత్వం ప్రబలడానికి కారణమైన లోపాలను సరిదిద్దడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా.. ప్రభుత్వం నూతన బార్ పాలసీ తీసుకువచ్చినట్టుగా స్పష్టమవుతోంది.
గత ప్రభుత్వ కాలంలో అరాచకత్వం రాజ్యమేలింది. ధరలను పెంచి సాగించిన దోపిడీ పర్వం ఒక ఎత్తు. కానీ.. దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నదని చెప్పిన మాయలో జరిగిన మోసాలు, ప్రబలిన అరాచకాలు అన్నీ మరొక ఎత్తు. గత ప్రభుత్వ హయాంలో దుకాణాలను ప్రభుత్వం నిర్వహించింది. లిక్కరు అమ్మేయడం వరకే వారి పని. పర్మిట్ రూములు అనేవి అధికారికంగా లేవు. కానీ దాదాపుగా అన్ని మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూము అనధికారికంగా నడిచాయి. వైసీపీ దళాలే వాటిని నిర్వహించుకున్నాయి. ఈ అనధికార పర్మిట్ రూములతో లక్షలు సంపాదించుకున్నారు. ఆ అరాచకత్వంతో పాటు.. దుకాణాల వద్ద రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవించే వారు కూడా విపరీతంగా ఉండేవారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం జరగకుండా, లాఅండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పర్మిట్ రూములు ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇప్పుడు మంత్రి పార్థసారధి ప్రకటించారు.
ఇప్పుడు ప్రభుత్వం పర్మిట్ రూములు ఏర్పాటుచేయడం వల్ల గత కాలం నాటి అరాచకాలు తగ్గడం మాత్రమే కాదు.. అచ్చంగా ప్రభుత్వానికి లాభం కూడా వస్తోంది. జగన్ సర్కారు అప్పట్లో తెచ్చిన కొత్త లిక్కర్ పాలసీ అనేది.. జగన్ మరియు ఆయన అనుచర గణాలు మూడున్నర వేల కోట్లరూపాయలను దోచుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది. కానీ.. ఇప్పుడు అలా కాదు. ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతోంది.
పైగా ప్రభుత్వం ఈ బార్ పాలసీలో కూడా గీత కార్మికు లసామాజిక వర్గానికి మేలు చేయడానికి ఎంతో వెసులుబాటు కల్పించింది. నూతన బార్ పాలసీలో భాగంగా వైన్ షాపుల తరహాలోనే, బార్లలో కూడా పదిశాతం కల్లుగీత కార్మికులకు కేటాయించాలని నిర్ణయించారు. వారికి ఫీజులో 50 శాతం రాయితీ కూడా ఉంటుంది. ఈ నిర్ణయం పట్ల ఆ సామాజిక వర్గంలో హర్సాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.