అమ్మ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా జగన్!

ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో ఎమోషనల్ మాటలకు ఇప్పుడు ప్రయారిటీ ఇస్తున్నారు. భావేద్వేగ భరిత ప్రసంగాలతో పార్టీ నాయకులను తనతోనే ఉండేలా చేసుకోవాలని అనుకుంటున్నారు. తాత్విక దృక్పథం ప్రదర్శిస్తున్నారు. అయితే ఎవ్వరు తనతో ఉన్నా లేకపోయినా పర్లేదు.. అన్నట్టుగా మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డికి కనీసం ఆ మాటలు చెబుతున్న సమయంలోనైనా.. తాను ఎవరెవరికి ఎలాంటి ద్రోహం చేశాడో గుర్తుకు వస్తుంటుంది కదా? అని పలువురు భావిస్తున్నారు. తాను ఎవరెవరిని ఎలా వాడుకుని వదిలేశాడో బుర్రలో తిరుగుతుంది కదా అంటున్నారు. అధికారం అందించిన అహంకారం దిగిపోయిన తర్వాత అమ్మ గుర్తుకు వచ్చిందా జగన్ అని ప్రశ్నిస్తున్నారు.

ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి.. బుధవారం తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన కొందరు నాయకులతో ముచ్చటించారు. పార్టీనుంచి పలువురు నాయకులు రాజీనామా చేసి వెళ్లిపోయే ప్రమాదం ఉన్నదని వారి మధ్య చర్చకు వచ్చింది. అయితే జగన్.. ‘వెళ్లిపోవాలనుకునే వారిని ఎంతకాలం ఆపగలం. అది వారిష్టం. విలువలు, నైతికత అనేవి వారికి ఉండాలి. వెళ్లేవారు వెళతారు.. బలంగా నిలబడగలిగేవారే నాతో ఉంటారు..’ అంటూ నిర్వేదం ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ఆయన ‘‘పార్టీలో నేను, అమ్మ ఇద్దరమే మొదలై ఇంత దూరం వచ్చాం. ఇప్పుడు మళ్లీ మొదటినుంచి ప్రారంభిద్దాం ఇబ్బందేమీ లేదు’’ అని అన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

ఈ మాటలే జగన్ యొక్క అహంకారానికి, అబద్ధాలాడే వైఖరికి నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ‘అమ్మ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా జగన్’ అని ప్రశ్నిస్తున్నారు. అధికారం దక్కిన వెంటనే.. అమ్మ మాటకు విలువ ఇవ్వకుండా పక్కన పెట్టేసినప్పెుడు.. ఒకసారి ఓడిపోయిన తర్వాత అమ్మకు కూడా మళ్లీ అవకాశం ఇవ్వకుండా వంచించినప్పుడు.. అమ్మ నీతో తొలినుంచి ఉన్నదని గుర్తుకురాలేదా? అని అందరూ అడుగుతున్నారు.
అమ్మ సంగతి మాత్రం చెబుతున్నావే.. విజయమ్మతో పాటు అదే సమయంలో.. షర్మిల కూడా పార్టీ ప్రారంభం నుంచి నీకోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడింది కదా.. అంత సులువుగా మర్చిపోయావా అంటున్నారు. సొంత ఆడబిడ్డతో పార్టీకోసం అరవ చాకిరీ చేయించుకుని.. అవసరం తీరగానే కరివేపాకులో తీసి పారేసిన జగన్.. విలువలు, నైతికత గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories