ఏపీ మంత్రి నారా లోకేష్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది. ఆయన బుధవారం సాయంత్రం బయల్దేరి ఢిల్లీ వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలక విషయాలు చర్చించే నిమిత్తం అమిత్ షా పిలిపించినట్టుగా తెలుస్తోంది. అయితే వివరాలు మాత్రం బయటకు రాలేదు. అయితే రాజకీయ వర్గాల్లో సాగుతున్న ఊహాగానాలను బట్టి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో జరిగిన అరాచకాలపై, అప్పట్లో విచ్చలవిడిగా దుర్మార్గంగా చెలరేగిన నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలపై చర్చించేందుకే లోకేష్ కు పిలుపు వచ్చినట్టుగా అనుకుంటున్నారు.
నారా లోకేష్ గత అయిదేళ్లలో ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లోనే.. వైసీపీ అరాచకాలమీద విరుచుకుపడుతూ వచ్చారు. జగన్మోహనరెడ్డి ఆయన అనుచర నాయకుల అండ చూసుకుని చెలరేగుతూ వచ్చిన అధికారుల తీరును కూడా ఆయన నిలదీస్తూ వచ్చారు. తప్పుడు పనులు చేసే అధికారులందరి వివరాలు తన వద్ద ఉన్న రెడ్ బుక్ లో రాస్తున్నానని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ లోని అందరి సంగతి తేలుస్తామని లోకేష్ చెబుతూ వచ్చారు.
జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత.. పదేపదే రెడ్ బుక్ ప్రస్తావన తెస్తూ భయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే లోకేష్ మాత్రం ఇప్పటిదాకా ఆ మాటెత్తలేదు. వైసీపీ వీర భక్త అధికారుల్ని పక్కకు తప్పించడం అనే ప్రక్రియ, ప్రభుత్వం మారిన ప్రతిసారీ ఎలా జరుగుతుందో అలాగే జరిగిపోయింది తప్ప.. రెడ్ బుక్ లో నమోదు చేసిన తప్పుడు అధికారుల మీద, అవినీతి నాయకుల మీద ప్రత్యేక చర్యలు అంటూ ఇప్పటిదాకా జరగలేదు.
అయితే అమిత్ షా పిలుపు మేరకు నారా లోకేశ్ ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో ఈ విషయాలే చర్చకు వస్తాయని.. రెడ్ బుక్ లో ఎవరెవరి అవీనీతి బాగోతాలు ఉన్నాయో తెలుసుకుని, కేంద్రం ద్వారానే వారి మీద చర్యలకు ఉపక్రమించడం జరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. రెడ్ బుక్ వివరాలు అంటూ ఏవీ బయటపెట్టకుండానే.. రాష్ట్రప్రభుత్వం చేతికి మట్టి అంటకుండానే.. కేంద్ర సంస్థల ద్వారానే వైసీపీ జమానాలో విచ్చలవిడిగా వ్యవహరించిన తప్పుడు మనుషుల భరతం పట్టేందుకు, వారి అవినీతిని తేల్చేందుకు చర్యలుంటాయని అంటున్నారు. మరి షాతో భేటీ తర్వాత అయినా లోకేష్ ఏమైనా వివరాలుప్రకటిస్తారో లేదో చూడాలి.