ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా కూడా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. అలాంటిది.. ఏపీలో గత అయిదేళ్లలో జరిగిన లిక్కర్ కుంభకోణంతో పోలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది కేవలం సముద్రంలో ఒక నీటి బొట్టు అంత మాత్రమేనని.. తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఢిల్లీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఈ విషయంపై దృష్టి సారించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును పిలిపించుకుని.. ఈ స్కామ్ కు సంబంధించిన వివరాలు అన్నింటినీ తీసుకున్నారు.
కాగా, హోంమంత్రితో సమావేశంలో ఎంపీ లావు.. అనేక నివ్వెరపోయే వాస్తవాలను డాక్యుమెంట్లతో సహా ఆయన ఎదుట పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. వేల కోట్ల రూపాయలు దేశం దాటి వెళ్లిన వైనం కూడా ఆయన దృష్టికి సాక్ష్యాల సహా తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఈడీ విచారణ కూడా డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. లావు చూపిన ఆధారాలను బట్టి కేంద్రం ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణిస్తే గనుక.. మొత్తం బాగోతాన్ని వెలికితీస్తారని ప్రజలు అనుకుంటున్నారు.
జగన్ ఏర్పాటుచేసిన ప్రభుత్వ దుకాణాల ద్వారా 99వేల కోట్లరూపాయల మద్యం వ్యాపారం జరగ్గా, కేవలం 690 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీల రూపేణా జరిగినట్టు ఎంపీ లావు, కేంద్ర హోంమంత్రికి వివరించారు. 20356 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలను రికార్డుల్లో లేకుండా గోప్యంగా నిర్వహించినట్టుగా లావు తెలియజేశారు. మద్యం తయారీ కంపెనీలను తమ గుప్పిట్లోకి తీసుకున్నారని, వాటితోపాటు.. తమతో కుమ్మక్కు అయిన సంస్థలకు మాత్రమే ఆర్డర్లు పెడుతూ ప్రభుత్వ దుకాణాల ద్వారా పెద్ద దందా నడిపించారని, అయిదేళ్లలో 36 కొత్త బ్రాండ్ల మద్యం తీసుకువచ్చి.. అంతర్జాతీయ బ్రాండ్లు ఏవీ అందుబాటులో లేకుండా చేసి.. అరాచకంగా నిర్వహించారని లావు కృష్ణదేవరాయలు ఆరోపించారు. హైదరాబాదులోని సునీల్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా.. రెండు వేల కోట్లరూపాయలను దుబాయి లోని ఇన్‌ఫ్రా కంపెనీ పేర తరలించిన వైనం కూడా ఆధారాలతో సహా హోంమంత్రికి చూపించారు.
మొత్తానికి లావు క్రిష్ణదేవరాయలు ఆరోపణలతో ఏపీ మద్యం స్కామ్ తేనెతుట్టె కదిలినట్లయింది. అమిత్ షా స్వయంగా పిలిపించి వివరాలు తీసుకున్నారనగానే.. ఆ స్కామ్ పాత్రధారులు, సూత్రధారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విచారణ పూర్తిచేసిన తర్వాత కేసులు నమోదు చేయగా.. తన పేరు నిందితుల జాబితాలో లేకపోయినప్పటికీ.. తనకు నోటీసులు రాకపోయినప్పటికీ.. తనకు ముందస్తు బెయిలు ఇవ్వాలని పిటిషన్ వేయడం ద్వారా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నవ్వులపాలయ్యారు. లిక్కర్ స్కామ్ తన పీకలమీదికి వస్తుందని ఆయన భయపడుతున్నాకరనడానికి అదే నిదర్శనం అని పలువురు అనుకుంటున్నారు. అలాంటి సమయంలో ఏకంగా అమిత్ షా పూనుకున్న తర్వాత.. ఈ స్కామ్ తో సంబంధం ఉన్న అందరిలోనూ ఆందోళన పెరిగినట్లుగా తెలుస్తోంది.