కేంద్రంలోని భాజపా పెద్దల వద్ద పవన్ కల్యాణ్ కు ఉన్న ఆదరణ, మన్నన మరో మెట్టు పైకి ఎగసినట్టే. మహారాష్ట్ర ఎన్నికలలో దక్కిన అపూర్వ నేపథ్యంలో.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశిష్టమైన వ్యాఖ్యతో పవన్ కల్యాణ్ ను ప్రశంసించారు. ‘పవన్ కల్యాణ్ ఒక క్రౌడ్ పుల్లర్’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. జనసేన పార్టీకి చెందిన లోక్ సభ ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఢిల్లీలో మర్యాదపూర్వకంగా తనను కలిసినప్పుడు.. మహారాష్ట్ర ఎన్నికల ప్రస్తావన తీసుకువస్తూ.. జనసేనాని పవన్ కల్యాణ్ గురించి అమిత్ షా ఈ రకమైన ప్రశంసాత్మక వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు రాష్ట్రంలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అందరికీ తెలుసు. అదే స్థాయిలో ఆయనకు మహారాష్ట్రలో కూడా అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఆయన మహాయుతి అభ్యర్థులకు అనుకూలంగా సుడిగాలి పర్యటనతో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పవన్ గట్టిగా ప్రచారం చేయగా 12 స్థానాల్లో మహాయుతి అభ్యర్థులు ఘనవిజయం సాధించారు.
విజయం మాత్రమే కాదు.. పవన్ కల్యాణ్ రోడ్ షోలు, బహిరంగ సభల సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు అపూర్వమైన స్పందన కనబరిచారు. ఆయనకు నీరాజనం పట్టారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ వస్తున్నారంటూ అక్కడి మరాఠాలు నినాదాలతో హోరెత్తించారు. ఈ అంశాలన్నీ హోంమంత్రి అమిత్ షా దృష్టికి కూడా వెళ్లినట్టున్నాయి.
అందుకే ఆయన బాలశౌరి తనను కలిసినప్పుడు.. మహారాష్ట్ర ప్రజల్లో ఉన్న ఆదరణతో పవన్ కల్యాణ్ మహాయుతి అభ్యర్థుల విజయంలో భాగస్వామి అయ్యారంటూ కితాబు ఇచ్చారు.
ఇదెలా ఉండగా.. పవన్ కల్యాణ్ ఇటీవలే ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కూడా కలిసి వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించి వచ్చారు. కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్లింగ్ బాగోతాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత.. స్వయంగా అక్కడకు వెళ్లిన పవన్ కల్యాణ్ పోర్టులో వ్యవహారాల పట్ల అసంతృప్తితో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించిన సంగతి కూడా అందరికీ గుర్తుంటుంది. మొత్తానికి కమలదళంతో పవన్ బంధం మరింత దృఢతరం కావడానికి మహాయుతి విజయం కూడా ఒక కారణం అవుతుందని ప్రజలు అనుకుంటున్నారు.