అంబికా, జీవీఎల్ రూపంలో పొత్తుల్లో ముసలం!

అధికార మార్పిడి జరిగితే తప్ప రాష్ట్రాన్ని కాపాడడం కష్టం అనే మాట ప్రతిపక్ష నేతల నుంచి చాలాకాలంగా వినిపిస్తూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓటమి ఒక్కటే లక్ష్యంగా.. ప్రతిపక్షాలు జట్టుకట్టాయి. పవన్ కల్యాణ్.. వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో పాటు, చంద్రబాబునాయుడు యొక్క పాలనానుభవం అవసరం ఈ రాష్ట్రానికి చాలా ఉన్నది అనే ఉద్దేశంతో.. చాలా కాలం కిందటే తెలుగుదేశంతోక లిసి వెళుతున్నట్టు ప్రకటించారు. ఆ పొత్తుల కూటమిలోకి అతి ప్రయత్నమ్మీద భారతీయ జనతా పార్టీని కూడా తీసుకువచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాలన వంటి అవినీతి మయమైన సర్కారు మరెక్కడా ఉండదని నినదించిన ప్రధాని మోడీ కూడా పొత్తులకు పచ్చజెండా ఎత్తారు.

అయితే, ఇప్పుడు ఏపీ భారతీయ జనతా పార్టీలోని కొందరు జగన్మోహన్ రెడ్డి కోవర్టులు పొత్తుల్లో ముసలం పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పొత్తు పార్టీల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా.. కూటమి అభ్యర్థుల పరాజయానికి పునాది వేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారిలో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, అంబికా కృష్ణ వంటి వారు ఉండడం విశేషం.

జీవీఎల్ నరసింహారావు వ్యవహారం మరీ చోద్యంగా ఉంది. ప్రజల్లో తిరిగి పనిచేసే అలవాటు లేని, మీడియా ముందు చిలక పలుకులు పలకడం తప్ప, ప్రజానాయకుడిగా గుర్తింపులేని ఆయనకు ఈసారి ఎంపీగా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగాలనే కోరిక పుట్టింది. విశాఖ నుంచి పోటీచేయాలని ఆయన అనుకున్నారు. ఒకవేళ పార్టీ సొంతంగా పోటీచేసి ఉన్నా కూడా ఆయనకు ఆ సీటు దక్కుతుందో లేదో చెప్పడం కష్టం. అలాంటి నేపథ్యంలో విశాఖను తీసుకోవడం గురించి.. బిజెపి చాలా కసరత్తు చేసి చివరికి ఆ సీటు వద్దనుకుంది. విశాఖ ఉక్కును ప్రెవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయం గొడ్డలిపెట్టుగా మారుతుందన్న భయంతోనే విశాఖను వద్దనుకున్నట్టు సమాచారం. రాజమండ్రి, నరసాపురం తీసుకుంది. అయితే ఇప్పుడు జీవీఎల్ హఠాత్తుగా తెరమీదికి వచ్చి తనకు విశాఖపట్నం సీటు కావాలని మారాం చేస్తున్నారు.

విశాఖలో పార్టీ చాలా బలంగా ఉన్నదని, గత అయిదేళ్లుగా విశాఖలో క్షేత్రస్థాయిలో చాలా వర్క్ చేస్తూ ప్రజాబలం పెంచుకున్నాం అని.. అక్కడ ఎంపీ సీటు తమ పార్టీకి ఇవ్వావలని జీవీఎల్ ను పోటీచేయించాలని ఇప్పుడు రకరకాల వాదనలు వస్తున్నాయి. జీవీఎల్ అనుచరులు అధిష్ఠానానికి లేఖ కూడా రాశారు. అక్కడ పార్టీని నిర్మాణం చేశామంటున్న నాయకులు విశాఖ ఉక్కు కోసం ఎన్ని పోరాటాలు చేశారో, అక్కడి ప్రజలతో ఎంత మమేకం అయ్యారో చెబితే బాగుంటుంది. జీవీఎల్ నరసింహారావు తొలినుంచి కూడా.. జగన్మోహన్ రెడ్డి కోవర్టుగా పనిచేస్తున్న నాయకుడే అని గుర్తింపు ఉంది. దానికి తగ్గట్టుగానే ఆయన ఇప్పుడు పార్టీలో ముసలం పెడుతున్నారు. స్నేహపూర్వక పోటీ కి పార్టీ తమను అనుమతించాలని అంటున్నారు.


అలాగే అంబికా కృష్ణ కూడా ఇదే తరహా ముసలంతో సిద్ధంగా ఉన్నారు. పార్టీ 175 స్థానాల్లోనూ సొంతంగా పోటీచేయాలని, లేకపోతే ఎప్పటికీ రాష్ట్రంలో బలపడదని ఆయన సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. మొత్తానికి బిజెపిలో ముసలం పుట్టించడానికి తమ కోవర్టుల ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories