వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిఉన్న నాయకులే చాలా తక్కువ. వారిలో మీడియా ముందు అవాకులు చెవాకులు, అర్థంపర్థంలేని వాదనలు వినిపిస్తూ అడ్డగోలుగా మాట్లాడగల నాయకులు ఇంకా తక్కువ. పంచ్ డైలాగులు వేస్తూ నాటకీయమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రెస్ మీట్లో చెలరేగేవారు కూడా తక్కువ. కాబట్టి.. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సరే.. చంద్రబాబునాయుడుకు ముడిపెట్టి నిందలు వేయడానికి.. వైసీపీ కార్యాలయ నిలయ విద్వాంసుడు అంబటి రాంబాబుకు ఒక అవకాశం దక్కుతూ ఉంటుంది. అమరావతి రాజధాని నగర పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్రమోడీ వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత.. ఆ కార్యక్రమం ఘనవిజయం అయిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళాలు ఓర్వలేకపోతున్నాయి. అసలు అమరావతిలో ఇలాంటి కార్యక్రమం జరగడమే చూసి ఓర్వలేని జగన్ ముందే బెంగుళూరు ప్యాలెస్ పారిపోయారు. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత.. అంబటి తనదైన శైలిలో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరినొకరు పొగుడుకోవడానికే ఈ సభ నిర్వహించినట్లుగా ఉన్నదని అంబటి సెలవిస్తున్నారు.
శుక్రవారం జరిగిన సభలో.. ప్రధాని నరేంద్రమోడీ కార్యదక్షత గురించి, ఆయన టెక్నాలజీని తీసుకువచ్చిన తీరు గురించి చంద్రబాబు ప్రశంసిస్తే.. నేను మీకందరికీ ఒక రహస్యం చెబుతా అంటూ.. ‘అందరూ తాను టెక్నాలజీ తీసుకువచ్చినట్టుగా చెబుతుంటారు గానీ.. తాను ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో చంద్రబాబునాయుడు ఏ రకంగా ఐటీవిప్లవాన్ని తీసుకువచ్చారో.. తాను అధికారుల్ని పంపి ప్రత్యేకంగా అధ్యయనం చేయించి మరీ తెలుసుకున్నానానని ప్రధాని అన్నారు. చంద్రబాబును మించిన నేత మరొకరు లేనే లేరని కూడా కితాబు ఇచ్చారు. బాబునుంచి ఎంతో తెలుసుకున్నానని కూడా అన్నారు. అనేక రకాలుగా చంద్రబాబు సమర్థతను ఆయన ప్రస్తావించారు.
బాబు- మోడీని పొగిడితే వారికి కష్టమేమీ లేదు. మోడీ చంద్రబాబును పొగడడం మాత్రం జగన్ దళాలు సహించలేకపోతున్నట్టుగా ఉంది. అంబటి రాంబాబు తన కడుపుమంటను దాచుకోలేకపోతున్నారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా.. ప్రధాని మోడీ.. రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా సందర్భాల్లో మోడీ విమానం దిగిన వెంటనే.. జగన్మోహన్ రెడ్డి ఆయన పాదాల మీద సాగిలపడి ప్రణామాలు పెట్టారు. సభావేదికల మీదినుంచి మోడీని ఆకాశానికెత్తేస్తూ పొగిడారు. కానీ జవాబుగా.. మోడీ మాత్రం.. జగన్ ను పొగిడిన దాఖలాలు లేవు. తమ అధినాయకుడు కూడా మోడీని గతంలో చాలి పొగిడినప్పటికీ.. తిరిగి పొగడలేదని.. ఇప్పుడు చంద్రబాబు పొగిడితే మాత్రం అంతకంటె ఎక్కువగా చంద్రబాబును మోడీ శ్లాఘిస్తున్నారని అంబటి రాంబాబు మరియు జగన్ అనుచరగణాలు కుమిలిపోతున్నట్టుగా కనిపిస్తోంది. నేరుగా మోడీని ఏమీ అనలేక.. ఆయన మాటలను తప్పుబట్టే ధైర్యం లేక.. వేదిక మీదినుంచి నాయకులు ఒకరినొకరు పొగుడుకోవడం లోనే గడిపారని అంబటి కుటిల విమర్శలు చేస్తున్నారు. ఆయన ఆరాటం చూసి జనం మాత్రం నవ్వుకుంటున్నారు.