వైసీపీ పిల్లి అని ఒప్పుకుంటున్న అంబటి!

వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే సింహం లాంటి నాయకుడని తెగనీలిగారు. పులి గర్జించినట్టు గర్జిస్తారని గప్పాలు కొట్టుకున్నారు. సింహం సింగిల్ గా వస్తుందని సినిమా డైలాగులు కొట్టారు. తీరా ఎన్నికలలో ప్రజలు చావు దెబ్బ కొట్టి 11 సీట్లతో ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తమ మీద తమకే నమ్మకం సడలిపోయినట్లుగా ఉంది. పాపం నీరుగారి పోతున్నట్లుగా కనిపిస్తున్నారు. తమ పార్టీ పిల్లి లాంటిది అని వారే చెప్పుకుంటున్నారు. ఇదేదో అమాయకంగా మాట్లాడే నాయకుల వ్యవహారం కాదు! వాక్యాతుర్యంలో ఆ పార్టీలో తనకు మించిన మొనగాడు లేడని నిరూపించుకుంటూ ఉండే అంబటి రాంబాబు వ్యాఖ్యానమే!

ఇంతకూ ఏం జరిగిందంటే పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నంబూరు శంకరరావు కార్యాలయం బయట గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించేశారు. దీనిని వైసిపి పార్టీ కార్యాలయం మీద జరిగిన అమానుషమైన దాడిగా చిత్రీకరించి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఫ్లెక్సీలు చిరగడానికి మించి జరిగినది ఏమీ లేకపోయినప్పటికీ నానా రాద్ధాంతం చేస్తున్నారు. రాజకీయంగా ఈ చిన్న ఘటనను వాడుకోవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇదంతా ఒక ఎత్తు కాగా ఎక్కడ ఏం జరిగినా సరే తగుదునమ్మా తానున్నానని ముందుకు వచ్చే అంబటి రాంబాబు.. సహజమైన శైలిలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడానికి ఈ అవకాశం వాడుకుంటున్నారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టేది లేదని ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని అంటున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు లేవు అని అంబటి మరియు నంబూరి శంకర్రావు అంటున్న వ్యాఖ్యలు చూసి జనం నవ్వుకుంటున్నారు. వైసీపీ పాలనలో ఫ్లెక్సీలు చించడంతో ఆగే వాళ్ళు కాదు కదా కార్యాలయం మొత్తాన్ని, ప్రజావేదిక లాంటి ప్రభుత్వ నిర్మాణాలను,  అన్న క్యాంటీన్లు నిర్మాణాలను సమూలంగా ధ్వంసం చేసేవారు కదా.. కేవలం ఫ్లెక్సీలు చించడం అనేది గతంలో ఎన్నడూ లేదనే మాట నిజమే అని జోకులు వేసుకుంటున్నారు.

అంబటి మాటల్లో మరొక ట్విస్ట్ ఏమిటంటే.. పిల్లిని గదిలో వేసి కొడితే పులి అవుతుందని.. ఆ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని ఆయన హెచ్చరిస్తున్నారు. అంటే తమ పార్టీ పిల్లి లాంటిదని తమను అదే పనిగా వేధిస్తే ఏదో ఒక నాటికి రోషం వచ్చి తిరగబడతామని ఆయన చెబుతున్నట్లుగా ఈ మాటలు ఉంటున్నాయి. పాపం అంబటి రాంబాబుకు అధికారం లేని సీజనులో మాటలలో చాతుర్యం కూడా పట్టుతప్పిందని, తమ పార్టీ పిల్లి అని ఒప్పుకుంటున్నారని..  ప్రజలు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories