అమరావతి పురోగతి ఇక సూపర్ ఫాస్ట్!

చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారో లేదో, రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగిపోతున్నాయి. రాష్ట్రానికి రాజధాని ఏది? అని స్పష్టత వస్తే చాలు పనులు శరవేగంగా జరుగుతాయి- అనే సంకేతం అందిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ పోతున్నది. అసలు రాజధాని అనేది లేకుండా ఐదేళ్లపాటు జగన్మోహన్ రెడ్డి సాగించిన దుర్మార్గమైన పరిపాలన పట్ల కేంద్రం కూడా ఒక విముఖతతోనే ఉంది.

చంద్రబాబు అధికారంలోకి రావడం, అదికాస్తా ఎన్డీఏ కూటమి విజయం కింద నమోదు కావడంతో కేంద్రం సానుకూలంగా స్పందిస్తోంది. పైగా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాజధాని ప్రాంతాన్ని గెజిట్ లో నోటిఫై చేయడం అధికారిక లాంఛనంగా బాగా ఉపయోగపడింది.

ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు కోసం 17 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా అమరావతి మౌలిక వసతులు కల్పనకు 15 వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రకటించడం ఒక ఎత్తు! మరోవైపు అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ తమ కార్యాలయాల నిర్మాణానికి వేగంగా కదులుతున్నాయి.

ఇవన్నీ కాకుండా తాజాగా రైల్వే బడ్జెట్ సందర్భంగా కూడా అమరావతి నగర నిర్మాణం చాలా ఆశావంగా కనిపిస్తోంది. అమరావతి రాజధానిని ప్రధాన రైల్వే మార్గాలతో అనుసంధానించేలా 56 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. అలాగే అమరావతి లో నవీన రైల్వే స్టేషన్ నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల కేటాయింపు పూర్తి చేస్తే తక్షణమే అక్కడ పనులు మొదలవుతాయని హామీ కూడా రైల్వే మంత్రి ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న వివిధ రైల్వే లైన్ నిర్మాణాల ప్రాజెక్టుల పనులు కూడా ఈసారి మరింత వేగంగా సాగనున్నాయి. అమరావతిని అనుసంధానం చేసే ప్రయత్నాలు వేగవంతం అవుతాయి.

ఇదంతా కూడా రాజధాని పనులు చకచకా సాగడానికి ఉత్ప్రేరకాల వంటివి.  
ఒకవైపు ప్రభుత్వం పెండింగ్లో ఉండిపోయిన రాజధాని భవనాల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఒక రూపు తీసుకురావాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నది.

అదే సమయంలో కేంద్రం వైపు నుంచి కూడా అమరావతి రాజధాని కోసం అన్ని రకాలుగా అందుతున్న మద్దతు ప్రజలందరిలోను  కొత్త ఆశలను చిగురింప చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో అమరావతి పురోగతి అనేది ఉరుకుల పరుగుల మీద ముందుకు సాగుతుందని ప్రజల ఆశిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories