అమరావతి రాజధాని నిర్మాణానికి అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి. అమరావతి నగర నిర్మాణానికి రుణాలు అందించేందుకు ప్రపంచబ్యాంకు కూడా పూనిక వహిస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, నగర నిర్మాణానికి ప్రపంచబ్యాంకు రుణం కోసం చేసిన ప్రయత్నం ఇప్పుడు మళ్లీ ట్రాక్ మీదకు వచ్చింది. తాను ముఖ్యమంత్రి కాగానే.. అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు రుణం తమకు వద్దని ప్రత్యేకంగా కేంద్రానికి లేఖ రాసి మరీ మోకాలడ్డిన జగన్మోహన్ రెడ్డి కుట్రలు భంగమైనట్టే. ఇప్పుడు ప్రపంచబ్యాంకు ప్రతినిధులు, అమరావతికి వచ్చి సీఆర్డీయే అధికార్లతో కలిసి నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. తిరిగి రుణం మంజూరుకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి.
మొత్తానికి అమరావతి నగర నిర్మాణం శరవేగంగా సాగడానికి ప్రయత్నాలు ప్రారంభం అయినట్టే. ఇప్పటికే 15వేల కోట్లరూపాయల నిధులు సర్దుబాటు చేయడానికి కేంద్రం బడ్జెట్ లో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న రోజుల్లోనే నగర నిర్మాణానికి ఏఐఐబీతో కలిసి 3500 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. ఆ నిధులు వచ్చి ఉంటే రాజధానిలో అనేక నిర్మాణాలు చేపట్టి ఉండొచ్చు. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన జగన్.. తమకు రుణం వద్దంటూ తిరస్కరించారు. ఇప్పుడు ఎన్డీయే సర్కారు అమరావతికి అగ్రస్థానం ఇస్తుండడంతో.. మళ్లీ ప్రపంచబ్యాంకు రుణం తెరపైకి వచ్చింది. ఆ బృందం సీఆర్డీయే అధికార్లతో కలిసి అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు అన్నింటినీ పరిశీలించారు. ఐఏఎస్ క్వార్టర్లు, జడ్జిల భవనాలు, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. తాగునీటి సరఫరా ప్రణాళిక వివరాలు కూడా తెలుసుకున్నారు. ఈ రుణం కూడా వచ్చినట్లయితే.. రాబోయే కొద్దినెలల్లో రాజధాని నిర్మాణాలు వేగం పుంజుకునే అవకాశం ఉంది.
మొత్తానికి రాబోయే అయిదేళ్ల చంద్రబాబు ప్రభుత్వ కాలంలో అమరావతి ప్రాంత రూపురేఖలు సమూలంగా మారిపోతాయని.. రాజధాని అద్భుత నగరంగా ఒక దశవరకు చేరుకుంటుందని పలువురు ఆశావహ దృక్పథంతో ఉన్నారు.