ప్రధాని రాకపై అమరావతికి కోటి ఆశలు!

సరిగ్గా నెలరోజుల్లోగా అమరావతిలో అద్భుతమైన పండగ జరగబోతోంది. ఆగిపోయిన పనుల పునఃప్రారంభానికి శంకుస్థాపన మాత్రమే కాదు. అమరావతిలో చంద్రబాబునాయుడు సంకల్పించిన నవనగరాలకు కూడా శ్రీకారం చుట్టం జరుగుతుంది. ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా ఈ శుభకార్యం జరగబోతోంది. గతంలో మాదిరిగా కాదు- ప్రధాని చేతుల మీదుగా లాంఛనం  పూర్తయిన వెంటనే.. అన్ని నిర్మాణపనులు శరవేగంగా జోరందుకోనున్నాయి. ఇప్పటికే టెండర్లు దక్కించుకున్న సంస్థలన్నింటికీ ఒప్పందపత్రాలు కూడా అందజేసేసిన నేపథ్యంలో వారు మెషినరీ, మ్యాన్ పవర్ ను అమరావతికి తరలించుకుంటున్నారు. ప్రధాని చేతులమీదుగా టెంకాయకొట్టడం పూర్తయిన వెంటనే.. పనులు శరవేగంగా ప్రారంభం అయిపోతాయి.

అమరావతి పనుల పునఃప్రారంభానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ రానున్న నేపథ్యంలో చాలా పెద్ద స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుత సచివాలయానికి వెనుకవైపున 250 ఎకరాల స్థలంలో సభాకార్యక్రమం నిర్వహించేందుకు చదును చేసే పనులు మొదలయ్యాయి. ఏప్రిల్ 15-20 తేదీల మద్యలో ప్రధాని పర్యటన ఖరారు అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటించి మోడీని ఆహ్వానించినప్పుడు.. ఫ్లెక్సిబుల్ గా తేదీలను ఆయనకు సమర్పించి వచ్చారు.

ఈ విడతలో పనుల ప్రారంభానికి మోడీ వచ్చినప్పుడు అమరావతికి కొత్త వరాలు వెల్లువలా కురుస్తాయని రాష్ట్రప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో చంద్రబాబు పాలన కాలంలో తొలిసారి శంకుస్థాపన చేసినప్పుడు.. ప్రధాని నిర్దిష్టంగా పెద్ద హామీలేమీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పటికే వేలాది కోట్లరూపాయల నిధులను అమరావతి కోసం సమకూర్చడానికి కేంద్రం ముందుకు వచ్చింది. ప్రపంచబ్యాంకు ఏడీబీ ల ద్వారా సమకూర్చనున్న 15వేల కోట్లరూపాయల రుణం పూర్తిగా కేంద్రమే తిరిగి చెల్లించనుందని గతంలోనే ప్రకటించారు. అలాగే అవుటర్ రింగ్ రోడ్డు పనులకు కూడా ఆమోదం లభించనుంది. ఇంకా అమరావతిలో అనేక పనులు కేంద్రం మద్దతుతో జరగనున్నాయి.

ఇవి మాత్రమే కాకుండా సభా కార్యక్రమం నాటికి.. ప్రధాని కొత్త వరాలు కొన్ని ప్రకటిస్తారనే ఆశ ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. లోక్ సభలో ఎన్డీయే సుస్థిర ప్రభుత్వంగా నిలబడాలంటే.. తెలుగుదేశం మద్దతు తప్పనిసరి. ఇంత ప్రాధాన్యం ఉన్నా సరే.. చంద్రబాబునాయుడు ఇప్పటిదాకా ఎలాంటి బెదిరింపు ధోరణులకు వెళ్లకుండా రాష్ట్రానికి కావాల్సిన ప్రతి అవసరాన్ని మెతకవైఖరితో మాత్రమే సాధించుకుంటున్నారు. కేంద్రానికి పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు కలగంటున్న అమరావతి ప్రాజెక్టుకు ప్రధాని మోడీ ఈసారి తప్పకుండా కొత్త వరాలు ప్రకటిస్తారని అంతా అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories