అమరావతి నగరాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు.. ఐకానిక్ వంతెన నిర్మించేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో చంద్రబాబు పరిపాలన కాలంలోనే ఈ ఐకానిక్ వంతెనకు సంబంధించిన ఆలోచన చేశారు. జగన్ పాలన కాలంలో స్తబ్దత నెలకొంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మళ్లీ ఏర్పడిన తర్వాత అమరావతి శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఐకానిక్ వంతెన నిర్మాణానికి కూడా తాజాగా డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదించారు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన నాలుగు డిజైన్లను సిఆర్డిఏ వెబ్సైట్లో పెట్టి ప్రజల అభిప్రాయాన్ని ఆహ్వానించారు. మెజారిటీ ప్రజలు ఏ డిజైన్ కైతే ఓటు వేశారో అదే డిజైన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఎంపిక చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వన్నెతెచ్చే కూచిపూడి నృత్య భంగిమలను పోలిన విధంగా ఈ డిజైన్ ఉంటుంది. సీఆర్డీయే వెబ్ సైట్ లో అత్యధికంగా 14 వేల మందికి పైగా ఈ డిజైనుకు అనుకూలంగా ఓటు చేశారు. ఈ ఐకానిక్ వంతెనతో అమరావతి నగరానికి కొత్త శోభ చేకూరుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.
ఇతర ప్రాంతాల తో జాతీయ రహదారులకు అనుసంధానం చేసేలా ఈ వంతెన ప్లానింగ్ జరిగింది. ప్రధానంగా విజయవాడ-హైదరాబాదు వెళ్లే ఎన్ హెచ్ 65 జాతీయరహదారితో ఈ వంతెన ద్వారా అమరావతిలోని ఎన్ 13 రోడ్డును అనుసంధానం చేస్తారు. ఇది 5.2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనికోసం 2500 కోట్ల రూపాయల అంచనా బడ్జెట్ ని కేటాయించారు. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.
తెలంగాణలో హైదరాబాదు నగరానికి వన్నెతెచ్చేలాగా దుర్గం చెరువు వద్ద వేలాడే వంతెనను నిర్మించిన సంగతి అందరికీ తెలుసు. అలాంటి నేపథ్యంలో అమరావతిలో కూటమి ప్రభుత్వం నిర్మించబోతున్న యీ ఐకానిక్ వంతెన మరింత శోభాయమానంగా తయారవుతుందని అంచనా. దుర్గం చెరువు వేలాడే వంతినతో పోల్చి చూస్తే గనుక.. ఐకానిక్ వంతెన ఎంతో చవకగా పూర్తవుతున్నట్టు అనుకోవాలి. ఎందుకంటే దుర్గం చెరువు వంతెనకు కేవలం 233 మీటర్లు మాత్రమే ఉండగా, దానికి ఏకంగా 184 కోట్లు ఖర్చు పెట్టారు. అదే అమరావతిలో నిర్మిస్తున్న ఈ ఐకానికి బ్రిడ్జి నిర్మాణానికి 2500 కోట్ల అంచనా బడ్జెట్ అంటే పోల్చి చూస్తే చాలా తక్కువ ఖర్చు అనుకోవాలి.
ఎరుపు తెలుపు రంగుల్లో జంట పైలాన్లతో దీని నమూనానురూపొందించారు. స్వస్తిక్ హస్త రూపంలో ఉండే కూచిపూడి నృత్య భంగిమ డిజైన్ ఇది. ఇది కూడా దుర్గం చెరువు వంతెనలాగానే ఆరువరసలతో ఉంటుంది.