అమరావతి బ్రాండ్ : శిథిలాల్లోంచి పునర్నిర్మాణం దిశగా..

ఒక చిన్న ఇల్లు అయినా సరే.. నిర్మాణం చాలా ఈజీ. కానీ.. నిర్మాణం అయిన దానిని పైశాచికంగా ఎవరైనా కూల్చివేసిన తర్వాత.. అంతే అందంగా, అదే స్థాయిలో పునర్నిర్మించడం అనేది చాలా చాలా కష్టం. ఇప్పుడు అలాంటి కష్టమే ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎదురవుతోంది. అమరావతి రాజధాని నగర బ్రాండ్ ను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ను అంతర్జాతీయ స్థాయిలో పునర్నిర్మించడానికి చంద్రబాబు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. అమరావతి స్టార్టప్ ప్రాంత అభివృద్ధి బాధ్యత తీసుకుని రంగంలోకి దిగిన సింగపూర్ కన్సార్షియం ను జగన్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే.. నానా రకాలుగా వేధించి, వారిని వెళ్లగొట్టేలా చేసిన సంగతి అందరికీ గుర్తుంటుంది. అలాంటి నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం దృష్టిలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ను తిరిగి నిర్మించి.. అమరావతి నిర్మాణంలో వారు మళ్లీ భాగస్వాములు అయ్యేలా చేయడానికి చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళుతున్నారు.

గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదురైన వేధింపులను సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికీ మరచిపోలేదని, గతంలో తలపెట్టిన స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టడానికి సిద్ధంగా లేదని చెప్పుకొచ్చారు. జగన్  నిర్వాకం వలన దెబ్బతిన్న బ్రాండ్ ఇమేజిని పునరుద్ధరించేందుకు, సింగపూర్ తో మళ్లీ సత్సంబంధాలు నెలకొల్పేందుకు ఆ దేశ పర్యటనకు వెళుతున్నట్టుగా చంద్రబాబు వెల్లడించారు.

2019కి ముందే  అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు  సింగపూర్ సంస్థల కన్సార్షియంతో, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) కలిసి పనిచేసేందుకు చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే.. భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించి, ఉపాధి అవకాశాలు వస్తాయని, రాజధాని అభివృద్ధికి ఆ ప్రాజెక్టు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని అంతా ఆశించారు. అయితే ఈలోగా జగన్ అధికారంలోకి రావడంతో సర్వం నాశనమైంది. అమరావతి మీద కక్ష కట్టిన జగన్, సింగపూర్ సంస్థలపై బురద చల్లి.. వారితో ఒప్పందాలు రద్దు చేసుకుని.. వారంతట వారు వెనక్కు వెళ్లిపోయేలా వేధించారు.

ఇప్పటికీ వారు స్టార్టప్ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు రాకపోతుండగా.. వారితో సత్సంబంధాల్ని పునరుద్ధరించుకుని అమరావతి నిర్మాణంలో ఇతరత్రా ఏదో ఒక రూపంలో వారి సేవల్ని వాడుకునేందుకు ప్రయత్నించాలని ఆ దేశ పర్యటనకు వెళుతున్న చంద్రబాబు అంటున్నారు. సింగపూర్ తొలినుంచి మనకు స్నేహహస్తం అందించిందని, రాజధాని మాస్టర్ ప్లాన్ కూడా ఉచితంగా ఇచ్చిందని ఆయన గుర్తు చేస్తున్నారు.
సింగపూర్ కన్సార్షియం సంగతి పక్కన పెట్టినప్పటికీ.. జగన్ పరిపాలన వలన.. ఏపీ బ్రాండ్ ఇమేజి అన్నది దారుణంగా దెబ్బతిన్న మాట వాస్తవం. ప్రస్తుతం చంద్రబాబునాయుడు సర్కారు.. కేవలం అమరావతి రాజధానిని నిర్మించడం మాత్రమే కాదు.. బ్రాండ్ ఇమేజిని పునర్నిర్మించడం మీద కూడా పనిచేయాల్సి వస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories