అల్లు శిరీష్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఒక్కటీ పెద్ద సక్సెస్ అందుకోలేదు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం వంటి సినిమాలు కొంతమేరకు బాగానే ఉన్నప్పటికీ, కలెక్షన్ల పరంగా పెద్దగా నిలబడలేకపోయాయి. గత సంవత్సరం వచ్చిన బడ్డీ కూడా నిరాశ కలిగించింది. ఈ పరిస్థితుల్లో శిరీష్‌కి ఇప్పుడు హిట్ చాలా అవసరమైంది.
ఈసారి మాత్రం ఎలాగైనా విజయం సాధించాలనే ఆలోచనతో ఆయన జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాడు. భారీ యాక్షన్ సినిమాలు కాకుండా, ప్రేక్షకులను నవ్వించే పక్కా ఎంటర్టైన్మెంట్ జానర్‌లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక కొత్త కథను ఫైనల్ చేశారని, బచ్చలమల్లి సినిమాతో పేరు తెచ్చుకున్న దర్శకుడు సుబ్బు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
సుబ్బు సిద్ధం చేసిన కథలో కామెడీ ప్రధానంగా ఉండటంతో ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో శిరీష్ వెంటనే అంగీకరించాడని తెలుస్తోంది.