సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెట్టడానికి అవకాశం ఉన్నది కదాని.. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఎలాంటి వారినైనా వదిలేది లేదని కూటమి ప్రభుత్వం నిరూపించింది. తమ్ముడు తనవాడైనా ధర్మం పాటించి తీరాలన్న సూత్రాన్ని అవలంబించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భార్య భారతి మీద అసభ్యపోస్టులు పెట్టినందుకు.. తెలుగుదేశం కార్యకర్త, ఐటీడీపీ సభ్యుడు చేబ్రోలు కిరణ్ మీద కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కిరణ్ ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లి పర్యటన తరువాత పరిణామాల్లో ఆయన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ వైసీపీ నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. జగన్ తన పర్యటనలో పోలీసుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా సంచలనం అయింది. ఈ నేపథ్యంలో ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్.. సోషల్ మీడియాలో వైఎస్ భారతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలా మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసే వారిపై కూటమి ప్రభుత్వం తొలినుంచి కఠినంగానే వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తప్పిదాలకు పాల్పడిన వైసీపీ నేతలు అనేకమంది మీద ఇప్పటికే కేసులు నడుస్తున్నాయి.
తెలుగుదేశం మహిళనాయకులు, ప్రముఖుల కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేసిన వారు.. తప్పయిపోయింది.. క్షమించండి అంటూ చెంపలు వాయించుకుని ప్రభుత్వం ఆగ్రహించకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం.. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని, నాయకుల ఇళ్లలోని మహిళలపై కూడా వ్యాఖ్యలు చేసేవారు ఎంతటివారైనా ఏ పార్టీ వారైనా వదిలిపెట్టేది లేదని చెబుతూనే వస్తున్నారు. ఆ నీతిని తాజాగా నిరూపించారు. భారతిమీద పోస్టులు పెట్టినది తమ పార్టీ వాడే అయినప్పటికీ.. వెంటనే అరెస్టు చేయించారు.
మహిళలపై అసభ్య పోస్టులు పెట్టే విషయంలో తమ ప్రభుత్వం ఎవరినీ ఉపేక్షించదని హోం మంత్రి అనిత కూడా చెబుతూ వస్తున్నారు. కిరణ్ అరెస్టు ద్వారా.. చంద్రబాబునాయుడు ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రజలకు నమ్మకం కలుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సాగిన రోజుల్లో అంతా ఏకపక్షంగా ఉండేది. వైసీపీ వారి మీద వీసమెత్తు నిందలు, నిర్మాణాత్మక విమర్శలతో పోస్టులు పెట్టినా కూడా వారిని అరెస్టుచేసి దారుణంగా వేధించారు. అదే సమయంలో చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్ కుటుంబాల్లోని మహిళల గురించి అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిని కూడా పట్టించుకోలేదు. అంతే కాదు.. స్వయంగా తన తల్లిని, చెల్లిని కూడా బూతులతో దూషిస్తూ పోస్టులు పెట్టిన తమ పార్టీ కార్యకర్త మీద కూడా జగన్ ఈగ వాలనివ్వలేదు. కూటమి ప్రభుత్వం అలాంటి ద్వంద్వ ప్రమాణాలు పాటించదని, తప్పు చేసిన ఎవ్వరినీ ఉపేక్షించదని ఈ చర్యతో తేలుతోంది.