జనసేన పార్టీ అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా గాజు గ్లాసు గుర్తును మాత్రమే కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే, అందులో మరొక మడతపేచీ ఏంటంటే.. జనసేన పార్టీ పోటీలో లేని నియోజకవర్గాల్లో గాజుగ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ గా ఎన్నికల సంఘం అందరికీ అందుబాటులో ఉంచింది. దీంతో తెలుగుదేశం, భాజపా పోటీచేస్తున్న అనేక నియోజకవర్గాల్లో ఇండిపెండెంటు అభ్యర్థులు, తిరుగుబాటు అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తును తీసుకుంటున్నారు. దీని ప్రభావం కూటమి అభ్యర్థులకు భారీగా దెబ్బపడే ప్రమాదం కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయంపై తక్షణం హైకోర్టుకు వెళ్లి.. ప్రమాదాన్ని నివారించడానికి గల అవకాశాలను ఇప్పుడు కూటమి పార్టీలకు చెందిన న్యాయనిపుణులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.
గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేయడం అనేది ఏపీలో ఎన్డీయే కూటమికి చాలాపెద్ద దెబ్బ అని చెప్పాలి.
ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కూటమిలోని రెండు పార్టీలకు పెద్ద టెన్షన్ అయిపోయింది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన తిరుగుబాటు అభ్యర్తులతో పాటు, కొందరు ఇండిపెండెంట్లు కూడా గాజుగ్లాసు గుర్తును పొందారు. అయితే గాజు గ్లాసు అనేది జనసేన గుర్తుగా బాగా పాపులర్ అయింది. గ్లాసు అనగానే అది పవన్ కల్యాణ్ గుర్తు అనేది రాష్ట్రమంతా తెలుసు. ఈ నేపథ్యంలో ఈవీఎంలో ఆ గుర్తు కనిపిస్తే ఆటోమేటిగ్గా కొన్ని ఓట్లు పడిపోయే అవకాశం ఉంది. అంటే ఆ మేరకు తెలుగుదేశం బిజెపి నష్టపోతాయన్నమాట.
ఈ ఇబ్బందిని నివారించేందుకు.. ఒక పార్టీకి కేటాయించిన కామన్ సింబల్ ను, మిగిలిన నియోజకవర్గాల్లో ఫ్రీ సింబల్ గా కేటాయించకుండా కోరేందుకు హైకోర్టును సంప్రదించాలని ఎన్డీయే కూటమి భావిస్తోంది. ఈ మేరకు న్యా య నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. మంగళవారం ఉదయం హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇప్పటికే పలుచోట్ల గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయింపు కూడా జరిగిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా వస్తుందో వేచిచూడాలి.