ఆ ముగ్గురికీ ‘నిందితులు’ గా ప్రమోషన్!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు విచ్చలవిడిగా సాగిన అయిదేళ్ల కాలంలో.. ఆయనకు నమ్మిన బంట్లుగా సేవలందించిన ముగ్గురు.. తాజాగా అవినీతి కేసుల్లో ప్రమోషన్ పొందారు. ఇన్నాళ్లూ కేవలం అనుమానితులుగా ఉంటున్న వారి పేర్లను సిట్ పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. ఈ మేరకు న్యాయస్థానానికి మెమో కూడా సమర్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయులు అయిన ఇద్దరు అధికారులు మరియు వైఎస్ భారతికి అత్యంత విశ్వసనీయుడు అయిన మరో కీలక వ్యక్తి ఇప్పుడు, దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయలు స్వాహా చేసినట్టుగా ఆరోపణలున్న లిక్కర్ స్కాంలో నిందితులుగా చేరడం సంచలనం అవుతోంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేషీలో కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, ముఖ్యమంత్రికి ఓఎస్డీగా సేవలందించిన కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ లో పూర్తికాల డైరక్టర్ గా ఉన్న గోవిందప్ప బాలాజీలను కూడా కేసులో నిందితులుగా చేర్చారు. వారి ముందస్తు బెయిలు పిటిషన్లను హైకోర్టు పూర్తిగా తిరస్కరించిన నేపథ్యంలో.. వారు నిందితులుగా మారడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనే అనుమానాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో.. కొత్త లిక్కర్ పాలసీ తయారుచేసే పేరిట.. అడ్డగోలుగా డిస్టిలరీల నుంచి సొమ్ములు కాజేయడానికి వీలుగా విధానాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త లిక్కర్ పాలసీని అమలు చేయడం ద్వారా.. ప్రతి నెలా దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయలు వసూళ్లు చేసి వైసీపీ పెద్దలంతా పంచుకునే వారు. సింహభాగం బిగ్ బాస్ కు చేరేదని ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు మొత్తం తేలుస్తోంది. ఇదే కేసులో ఏ1గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి.. ఇప్పటికే పోలీసుల విచారణలో అనేక వాస్తవాలను వెల్లడించినట్టుగానూ, అదే సమయంలో.. కొన్ని విషయాలను ఇప్పటికీ దాస్తున్నట్టుగానూ వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కు, ఆయన భార్యకు అత్యంత విధేయులు అయిన ముగ్గురు కీలక వ్యక్తులు కేసులో నిందితులుగా మారడం సంచలనమే. మద్యం విధానం రూపకల్పనకు తొలి భేటీలు జరిగిన రోజు నుంచి కూడా.. కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ ధనుజంయరెడ్డి, భారతి సిమెంట్స్ డైరక్టర్ గోవిందప్ప బాలాజీలు కీలకంగా వ్యవహరించినట్టుగా వాంగ్మూలాలలో తేలింది. అంతే కాదు.. తన విస్తృతమైన నెట్ వర్క్ ద్వారా.. ప్రతినెలా మద్యం డిస్టిలరీలనుంచి వసూళ్లు చేసే రాజ్ కెసిరెడ్డి.. ఫైనల్ గా ఆ సొమ్ములన్నింటినీ ఈ ముగ్గురి చేతికే చేర్చేవాడని కూడా వాంగ్మూలాల్లో బయటకు వచ్చింది.

అంటే.. జగన్- భారతి తరఫున ఫైనల్ గా వాటా స్వీకరణ పర్వం వీరి చేతులమీదుగా నడిచేదన్న మాట. రాజ్ కెసిరెడ్డి తొలినుంచి ఏ1 గానే ఉన్నప్పటికీ.. నిందితుల జాబితా పలుమార్లు మారింది. తొలుత ఈ కేసులో సాక్షలుగా వచ్చిన విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి తర్వాత నిందితులుగా మారారు. విచారణల్లో ఈ ముగ్గురి పేర్లు వచ్చినా కూడా వారు ఇప్పటిదాకా అనుమానితులుగానే ఉన్నారు. ఆల్రెడీ ముప్పయి మంది నిందితుల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ముగ్గురిని కూడా సిట్ నిందితుల జాబితాలో చేర్చింది. వీరికి ముందస్తు బెయిలు ఇవ్వడానికి, అలాగే అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి కూడా హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో వీరి అరెస్టు తప్పదేమో అనే అభిప్రాయాలు ప్రజల్లో కలుగుతున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories