తాను అధికారంలోకి వచ్చిన వెంటనే.. శుభప్రదంగా నిర్వహించిన మొట్టమొదటి కార్యక్రమంగా ఉండవిల్లిల్లోని ప్రజావేదికను కూల్చివేయించిన విధ్వంసక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి! చంద్రబాబు నివాసానికి పక్కనే నిర్మించిన కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తిని, తాను గద్దె ఎక్కిన ఒకటిరెండు రోజుల్లోనే కూల్చవేయించి.. అయిదేళ్లపాటూ ఆ శిథిలాలను కూడా తొలగించకుండా.. చంద్రబాబు రోజూ ఆ శిథిలాలు చూస్తూ ఇంట్లోకి వెళ్తూ వస్తూ ఉండాలనేంత దుర్మార్గంగా ప్రవర్తించిన విధ్వంసక ప్రవృత్తి ఆయనది. అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఛీకొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత.. ఇప్పుడు హఠాత్తుగా ప్రజల ఆస్తుల మీద ప్రేమ కురిపిస్తున్నారు. ప్రజల పక్షాన నిలబడుతున్నారు. ట్వీట్లు పెడుతున్నారు.
ఇంతకూ ఆయన ఏం ట్వీట్ చేశారో తెలుసా..
‘‘రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం.’’ అని ట్వీట్ చేశారు.
ఏ ప్రజా ఆస్తులు ధ్వంసం అయ్యాయో జగన్ వివరించి చెబితే బాగుండేది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో దాడులు, ధ్వంసం జరిగిన మాట నిజం. కానీ వేటిమీద? మరుగుదొడ్ల మీద తప్ప.. ప్రభుత్వ ఆస్తి అయిన ప్రతి దాని మీదా తన ఫోటోతో జగన్ తగిలించిన బోర్డుల మీద మాత్రమే దాడులు జరిగాయి. ఆ బోర్డులను మాత్రమే పగలగొట్టారు. అలా పగలగొట్టిన వాళ్లందరూ తెలుగుదేశం కార్యకర్తలు అనడానికి కూడా వీల్లేదు. ఏ సామాన్య ప్రజలైతే, జగన్ ఉండగా ఈ రాష్ట్రం అభివృద్ధి మొహం చూడదనే కసితో.. భారీ స్థాయిలో ఓట్లు వేసి జగన్ పతనాన్ని నిర్దేశించారో.. ఆ ప్రజలే ఆ బోర్డులను పగలగొట్టారు. వారు ఇలా పగలగొట్టకపోయినా.. అధికారంలోకి చంద్రబాబు రాగానే.. ఆయా కార్యాలయాల సిబ్బందే వాటిని మార్చి తీరాలి. కాబట్టి వాటిని ధ్వంసం చేసిన ప్రజలు ప్రభుత్వానికి చేసిన నష్టం ఏమీ లేనే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలు తన ఫోటోలను పగలగొడుతూ, కాళ్లతో తంతూ ఉన్న దృశ్యాలను సొంత టీవీ ఛానెల్లో చూసుకుని చాలా బాధపడినట్లున్నారు. అందుకనే ఇలా ట్వీట్ లో ఆవేదన వెలిబుచ్చారని పలువురు అనుకుంటున్నారు.