అగ్రనేతలందరూ అమెరికా, యూరప్ లలోనే!

తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఎన్నికల పర్వం ముగిసింది.  ఎంపీ ఎన్నికల కంటే ఎమ్మెల్యే ఎన్నికలను నాయకులు చాలా సీరియస్‌గా తీసుకుంటారనే సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లుగానే వారు అసెంబ్లీ ఎన్నికల విషయంలో తీవ్ర ఒత్తిడి మధ్య ఎన్నికల పర్వాన్ని పూర్తి చేస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రత్యేకించి, ఏపీ రాష్ట్రానికి పెద్ద నాయకులందరూ ఒత్తిడి నుంచి బయటకు రావడానికి విదేశాలలో విహారయాత్రలలో గడుపుతున్నారు. ఒక్కరూ ఇద్దరూ కాదు. రాష్ట్రంలో నాలుగు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు ఇప్పుడు విదేశాలలోనే ఉండడం విశేషం!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి ఆరోపణల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు కనుక, ఆయన విదేశాలకు వెళ్లడానికి సిబిఐ కోర్టు అనుమతి కోరవలసి వచ్చింది. దాని వలన జగన్ విదేశాలకు వెళుతున్న సంగతి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఏ కేసులూ లేని మిగిలిన నాయకులు ఎప్పుడో విదేశాలకు వెళ్లారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా సకుటుంబంగా అమెరికాకు వెళ్లిన విషయం వార్తల్లో వచ్చింది. చంద్రబాబు కంటే నాలుగు రోజులు ముందుగానే నారా లోకేష్ కూడా విదేశాలకు వెళ్లారు.

అదే తరహాలో పోలింగ్ ముగిసిన రోజునే ఇక్కడి నుంచి నేరుగా సకుటుంబంగా వారణాసికి వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడ సతీసమేతంగా కాశీ విశ్వేశ్వరుని సేవలో పాల్గొన్నారు. మరునాడు ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ పర్వంలో కూడా పాల్గొన్నారు. అటునుంచి అటే సకుటుంబంగా అమెరికాకు వెళ్ళిపోయారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ చీఫ్ షర్మిల వ్యవహారం మరో ఎత్తు.

ఆమె అమెరికాకు ఎప్పుడు వెళ్లారునేది కూడా ఎవరికీ తెలియదు! రెండో కంటికి తెలియకుండా షర్మిల అమెరికాలోని కొడుకు వద్దకు, కొడుకుతో పాటు ఉన్న తల్లి వద్దకు వెళ్ళిపోయారు.
రాష్ట్ర ఎన్నికల సమరంలో అన్నాచెల్లెళ్లు జగన్- షర్మిల ముఖాముఖి తలపడిన ఈ ఎన్నికలలో ఇక్కడ ఉంటే ఎదురు కాగల ఒత్తిడిని భరించలేక వైయస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ చాలా కాలం కిందటే అమెరికాలోని మనవడి దగ్గరకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే కొడుకు జగన్ కు అనుకూలంగా ఆమె నోరు మెదపకపోయినప్పటికీ కూతురు షర్మిలారెడ్డిని- వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆశీర్వదించి కడప ఎంపీగా గెలిపించాలంటూ ఆమె అమెరికా నుంచే వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఆమెను ముందుగా అమెరికాలోని కొడుకు వద్దకు పంపిన షర్మిల పోలింగ్ పూర్తికాగానే తాను కూడా అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నాయకులందరూ జూన్ 1వ తేదీ నాటికి ఒక్కరొక్కరుగా తిరిగి రాష్ట్రానికి చేరుకునే అవకాశం ఉంది. ఫలితాలు వెలువడిన తరువాత ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరి వైభవం ఎలా నిర్ణయం అవుతుందో కాలమే తేల్చుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories