ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత.. కీలకమైన సమయంలో అధికార పార్టీకి కొమ్ముకాస్తూ, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఉన్నతస్థాయి అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆరుగురు ఐపీఎస్ అధికారులు, ముగ్గురు జిల్లా కలెక్టర్లపై ఇటీవల వేటు వేసి.. వారిని అప్రాధాన్య పోస్టుల్లో నియమించాల్సిందిగా, ఎన్నికల విధులకు దూరంగా ఉంచాల్సిందిగా ఈసీ అప్పుడే ఆదేశించింది. వారి స్థానాల్లో కొత్తగా నియమించేందుకు ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికార్ల పేర్లతో సిఫారసులు పంపాల్సిందిగా సీఎస్ ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పోస్టుల్లో కొత్త నియామకాలు కూడా పూర్తయ్యాయి. అయితే కొత్తగా నియమితులైన వారు కూడా ఇప్పటిదాకా ఉన్న తమ ట్రాక్ రికార్డులో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాసే నాయకులుగా ముద్రపడిన వారే కావడం విశేషం. సీఎస్ జవహర్ రెడ్డి ఏరి కోరి మరీ.. వైసీపీ అనుకూల ఐఏఎస్, ఐపీఎస్ అధికార్ల పేర్లను ఈసీకి పంపినట్టుగా విమర్శలు వస్తున్నాయి. వీరి సారథ్యంలో కూడా.. అధికార యంత్రాంగం యావత్తూ.. అధికార పార్టీకి కొమ్మకాసేలాగానే ప్రవర్తిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సీఎస్ జవహర్ రెడ్డిని మార్చే నిర్ణయం తీసుకుంటే తప్ప.. అధికార యంత్రాంగం నిజాయితీగా పనిచేయడం జరగదని పలువురు విమర్శిస్తున్నారు.
నిజానికి సీఎస్ జవహర్ రెడ్డి కూడా జగన్ అనుకూల వైఖరితోనే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. సీఎస్ జవహర్ రెడ్డితోపాటు, డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిని కూడా మారిస్తే తప్ప.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదని తెలుగుదేశం నాయకులు పలుమార్లు ఈసీకి ఫర్యాదు చేస్తున్నారు. ఈ ఇద్దరు ఉన్నతాధికారులపై ఇప్పటికే ఈసీ ప్రత్యేకంగా నజర్ వేసినట్టు సమాచారం. ఈ ఇద్దరూ కూడా అధికారపార్టీ అనుకూల వైఖరితోనే చెలరేగుతున్నారు. తెదేపా అభ్యర్థుల మీద రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని కేసులు నమోదై ఉన్నాయో చెప్పమని అడిగితే కూడా డీజీపీ స్పందించలేదని తెలుగుదేశం వారు ఫిర్యాదు చేశారు.
ఇలాంటి నేపథ్యంలో జిల్లాల్లో అరాచకాలు సృష్టిస్తున్న ఎస్పీలు, కలెక్టర్లను ఎందరిని మార్చినా.. వారి స్థానంలో మళ్లీ కొత్తగా వైసీపీ అనుకూల అధికారులే వస్తుంటారని.. సీఎస్ పోస్టులో జవహర్ రెడ్డి ఉన్నంత వరకు అంతా అలాగే జరుగుతుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ముందు సీఎస్ ను తప్పించి, ఆ తర్వాత.. మిగిలిన కిందిస్థాయి అధికారుల నియామకాలు చేపడితే.. న్యాయం జరుగుతుందని అంటున్నారు.