నటసింహం బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం మీద ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జార్జియాలో జోరుగా జరుగుతోంది.
ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్‌లో బాలయ్యపై ఒక భారీ యాక్షన్ సీన్ చిత్రీకరించడానికి టీమ్ సన్నద్ధమవుతోంది. ఆ యాక్షన్ సీక్వెన్స్‌లో బాలయ్యకు జతగా విదేశీ నటులు కూడా పాల్గొంటారని సమాచారం. ఈ సీన్‌లోనే బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న రెండో పాత్రకు సంబంధించిన ముఖ్యమైన ట్విస్ట్ బయటకు రానుందని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త తెలిసి బాలయ్య అభిమానులు మరోసారి ఉత్సాహంగా ఉన్నారు.
ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, ఈసారి కూడా బాలయ్య అఘోరి గెటప్‌లో మళ్లీ కొత్తగా కనిపించబోతున్నాడు. హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తుండగా, ప్రతినాయక పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నాడు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ ఇప్పటికే మూడు విజయం సాధించిందని చెప్పాలి. అందుకే అఖండ 2పై అంచనాలు మామూలుగా లేవు.
మొత్తం మీద ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌తో అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బోయపాటి అందించే మాస్ మసాలా కంటెంట్‌తో పాటు బాలయ్య ప్యూర్ ఎనర్జీ స్క్రీన్‌పై ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.