వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజులలో విచ్చలవిడిగా చెలరేగిన వారిలో సజ్జల భార్గవరెడ్డి ముందు వరుసలో ఉంటారు. తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి డి-ఫ్యాక్టో ముఖ్యమంత్రిలాగా, సకల శాఖల మంత్రి లాగా ప్రభుత్వాన్ని గుప్పెట పెట్టుకొని నడిపించిన నేపథ్యంలో.. కొడుకు సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా సారిదిగా రాజకీయ ప్రత్యర్థుల మీద అసభ్య బూతు పదజాలాలతో విషం కక్కడంలో ఆరితేరి వ్యవహరించారు. ఈ దుందుడుకుతనం పర్యవసానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న వారిలో సజ్జల భార్గవ్ పేరు కూడా చెప్పాలి. అయితే ఎప్పటికప్పుడు జారుకుంటున్న చిన్న సజ్జలకు ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాతావరణం ఏమంత సానుకూలంగా కనిపించడం లేదు. సుప్రీం న్యాయమూర్తుల వ్యాఖ్యలు గమనిస్తే సజ్జల భార్గవరెడ్డికి కోరుకున్న ఊరట దక్కడం సాధ్యమేనా అనే అనుమానం పలువురిలో కలుగుతోంది.
గత ఏడాది నవంబరులో సజ్జల భార్గవరెడ్డి తో పాటు మరో ఇద్దరి మీద కడప జిల్లా పులివెందులలో హరి అనే దళితుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఆ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఆయన ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేని కారణంగా విచారణ వాయిదా వేయాలంటూ భార్గవరెడ్డి తరపు న్యాయవాదులు కోరారు. వారి కోరికను మన్నించి కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేయడం జరిగింది కానీ, ఈ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు గమనార్హం. అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిలు కోసం ట్రయల్ కోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది కదా అని న్యాయమూర్తుల వ్యాఖ్యలు చేశారు.
ఈ మాట అన్న తర్వాత వచ్చేవారం వాయిదా సందర్భంగా అయినా సరే సజ్జల భార్గవరెడ్డి కోరిక తక్షణమే నెరవేరుతుంది అని అనుకోవడం భ్రమ! సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించినా కోర్టు ముందు ట్రయల్ కోర్టుని ఆశ్రయించి ఆ పిమ్మట రావాలని సూచిస్తే ఆశ్చర్యం లేదు! ఇటీవల లిక్కర్ స్కామ్ లో కీలక నిందితులు ముగ్గురు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ముందస్తు బెయిలు కోసం సుప్రీంను ఆశ్రయించినప్పుడు కూడా.. వారు చాలా నిక్కచ్చిగా.. హైకోర్టులో తేలిన తర్వాత రావాలంటూ తిప్పి పంపడం ఈ సందర్భంగా గమనార్హం. ప్రత్యర్థి పార్టీల వారి మీద అసభ్య పోస్టులకు కేంద్ర బిందువుగా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సకల భార్గవరెడ్డి చివరికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో కూడా చిక్కుల్లో ఉన్నారు. ఏ ఒక్క కేసులో కూడా తన పరిస్థితి అరెస్టు దాకా వెళ్లకుండా.. గంటకు లక్షల్లో ఫీజులు తీసుకునే సీనియర్ న్యాయవాదులతో సజ్జల తండ్రీ కొడుకులు పోరాడుతుండడం విశేషం.