నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ మీద దాదాపుగా పాతికేళ్ల తరువాత తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడబోతోంది. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుప్పిట్లో ఉన్న మునిసిపల్ కార్పొరేషన్ ను త్వరలోనే కూటమి జేజిక్కించుకోనుంది. ఇక్కడి మేయర్ స్రవంతి పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రంగం సిద్ధం అయింది. తీర్మానం నెగ్గడం అనేది లాంఛనం. మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కార్పొరేషన్ ఇప్పుడు తెలుగుదేశం ఆధీనంలోకి రానుండడం విశేషం. సార్వత్రిక ఎన్నికల తర్వాత దారుణ పరాజయం పాలైన జగన్మోహన్ రెడ్డి ప్రభావం క్రమక్రమంగా అంతరించిపోతున్నదని అనుకోవడానికి ఇది మరొక ఉదాహరణ. పార్టీని మంచి భవిష్యత్తు దిశగా నడిపే సామర్థ్యం జగన్ కు లేదని పార్టీ నాయకులు నమ్ముతున్నట్లుగా ఈ ఉదాహరణలు నిరూపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే అనేక మునిసిపల్ కార్పొరేషన్లు వైసిపి గొడుగు కింది నుంచి కూటమి పార్టీల ఆధీనంలోకి మారిపోయిన తరుణంలో నెల్లూరులో కూడా అదే జరగబోతుంది.
నెల్లూరులో మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. గతంలో మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం 54 స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంది. 2019లో నెల్లూరు జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్నట్లే, మునిసిపల్ ఎన్నికలలో అన్ని డివిజన్లను కూడా వైసిపి క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఐదేళ్ల పరిపాలన కాలంలో అభివృద్ధి పనుల మీద జగన్ ఏమాత్రం దృష్టి సారించలేదనే అభిప్రాయం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీలో ఉన్న రోజుల్లో కూడా అభివృద్ధి పనులకు నిధులు రావడం లేదంటూ అనేక మార్లు గళం వినిపించారు. రోడ్డపై నిరసనలు కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి కూడా గురయ్యారు. మొత్తానికి తాను తలచిన సంక్షేమ పథకాలు తప్ప మరొక అభివృద్ధి పని గురించి ఏమాత్రం పట్టించుకోని జగన్ తీరుతో విసిగి ఆయన తెలుగుదేశం లో చేరిపోయారు. ఇప్పుడు కార్పొరేషన్ ను టిడిపి పరం చేయడంలో మంత్రి నారాయణతో పాటు ఆయన కూడా కీలక భూమిక పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది.
గతంలోనే కోటంరెడ్డి టిడిపిలో చేరినప్పుడు ఆయన వెంట మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ స్రవంతి కూడా టిడిపిలో చేరిపోయారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఆమె తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో అధికార పార్టీ వారి ఒత్తిడులు ఆమె మీద పనిచేశాయని అంతా అనుకున్నారు. తీరా రాష్ట్రంలో ప్రభుత్వ మారిన తర్వాత జగన్ నాయకత్వంలో వైసిపికి భవిష్యత్తు ఉండదనే భయం చాలామందిలో ఏర్పడింది. అలాంటి వారందరూ కూటమి పార్టీలలో చేరిపోతున్నారు. స్రవంతి కూడా తిరిగి టిడిపిలోకి రావాలనుకున్నప్పటికీ.. గత అనుభవాల దృష్ట్యా వారు అనుమతించలేదని తెలుస్తోంది. అదే సమయంలో ఆ పార్టీ కార్పొరేటర్లకు మాత్రం రెడ్ కార్పెట్ వేశారు.
మొత్తం 54 మంది కార్పొరేటర్లలో ప్రస్తుతం వైసీపీలో మిగిలినది కేవలం 12 మంది మాత్రమే. బలం అంతగా సన్నగిల్లిన తర్వాత మేయర్ స్రవంతి పై అవిశ్వాస తీర్మానం కూడా ప్రతిపాదించారు. అది నెగ్గడం, టిడిపి నుంచి కొత్త మేయర్ ఎన్నిక కావడం అనేది లాంఛనమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు పార్టీ నుంచి నాయకులు ఒక్కొక్కరుగా జారుకుంటూ ఉండగా.. మరొకవైపు పార్టీ చేతిలో ఉన్న మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఒక్కొక్కటి ప్రత్యర్థుల పరమవుతుండగా జగన్మోహన్ రెడ్డి అసహనానికి గురవుతున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.